కోల్‌సిటీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలి మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు మాయమైంది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు, ఆస్పత్రి అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. కుందనపల్లి సమీప బద్రిపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ షుగర్ లెవల్స్ తగ్గడంతో సోమవారం జీజీహెచ్‌చే చేరింది. వైద్యుల సూచన మేరకు తొలుత సీటీ స్కాన్ చేయించారు. ఈ సమయంలో పేషెంట్ మెడలోని పుస్తెలతాడును కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈఎండీ విభాగంలో
ఆభరణాలు కనిపించలేదని..
సీటీస్కాన్ అనంతరం ఈసీజీ కోసం ఈఎండీ విభాగానికి తరలించారు. ఈసీజీ కోసం వృద్ధురాలికిని బెడ్‌పై పడుకోబెట్టారు. ఆమె కూతురును బయటకు పంపించారు. ఈ క్రమంలోనే పుస్తెలతాడు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఈసీజీ విభాగాన్ని పరిశీలించినట్లు తెలిసింది. పేషెంట్ కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బందిని కూడా విచారించినట్లు సమాచారం. పుస్తెలతాడు మాయంపై భిన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేషెంట్ వెంట ఉన్న వారెవరైనా తీసుకున్నారా? లేక ఆస్పత్రిలోనే ఎవరి చేతికై నా చిక్కాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. శ్రీఇంటి దొంగల పనే అయి ఉంటుందా?శ్రీ అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల మరో చైన్ మాయం?
ఈఎండీలో ఇటీవల ఓ పేషెంట్ చైన్ మాయమైనట్లు సమాచారం. అయితే అది ఒకేగ్రామ్ గోల్డ్ కావడంతో బాధితులు పెద్దగా పట్టించుకోకపోవడంతో విషయం బయటకు రాలేదని తెలుస్తోంది.


