పెద్దపల్లిరూరల్: మనిషి మరణానంతరం అవయవదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి వారికి బతుకునిచ్చిన వారమవుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. గురువారం ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా అడిషనల్ జడ్జి భవాని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మంజుల, జూనియర్ జడ్జి శ్రావణ్‌కుమార్ సదాశయ ఫౌండేషన్ వారితో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అవయవాలను దానం చేయడంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు స్వచ్ఛందసంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన న్యాయవాద దంపతులు అశోక్, రమాదేవిని జిల్లా జడ్జి, డీసీపీ రాంరెడ్డి తదితరులు సత్కరించారు. ఫౌండేషన్ ఫౌండర్ భీష్మాచారి, బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మల్లేశం, మార కిషోర్, డొంకెన రవీందర్, శ్రీధర్ తదితరులున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి
పెద్దపల్లి: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వేడుకల ఏర్పాట్లను గురువారం డీసీపీ రామ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పంద్రాగస్టు వేడుకలకు అతిథిగా విప్ విజయరమణారావు
సాక్షి, పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో జిల్లాలవారీగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు మంత్రులతో పాటు కేబినెట్ ర్యాంక్ ప్రజాప్రతినిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లిలో విప్ చింతకుంట విజయరమణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
నీట్ కోచింగ్‌కు దరఖాస్తులు
పెద్దపల్లి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నీట్–2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్ అందించనున్నట్లు డీసీవో, మంథని ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తెలిపారు. బాలురకు హైదరాబాద్‌లోని సీఓఈ, బాలికలకు మహీంద్రాహిల్స్‌లోని సీఓఈ పాఠశాలలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 100 మంది బాలురు, 100 మంది బాలికల చొప్పున కోచింగ్ అందించనున్నట్లు వివరించారు. 2026 విద్యా సంవత్సరంలో బైపీసీ ఉత్తీర్ణులై, నీట్–2026 ప్రవేశ పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 28 గడువని, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. tgswreis. telangana. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి సమీప డీసీవో కేంద్రంలో సమర్పించాలన్నారు.
ఆకట్టుకున్న నాటిక ప్రదర్శన
రామగిరి: ఆర్జీ–3, ఏపీఏ ఏరియాలోని సెంటినరికాలనీ రాణిరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో గురువారం సింగరేణి, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన నిర్వహించారు. ఏపీఏ జీఎం కొలిపాక నాగేశ్వరరావు హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘాల ప్రతినిధులు ఎం.రామచంద్రారెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు బత్తుల శంకర్, ఆకునూరి బాల అంకూస్, కిషన్‌నాయక్ పాల్గొన్నారు.


