రామగుండం: కేంద్రం ప్రకటించిన వేతన కమీషన్‌లో లోకోపైలట్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆలిండియా లోకోరన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రామగుండం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై లోకో పైలట్లు ఆందోళన చేపట్టారు. 5,6,7వ పే కమీషన్‌లో లోకోరన్నింగ్ స్టాఫ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని, రైల్వేలోని రెండు ప్రధాన ట్రేడ్ యూనియన్లు దీనిపై స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే రన్నింగ్ స్టాఫ్ వేతన సవరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాయాలన్నారు. 8వ పే కమీషన్ సభ్యులు బేసిక్ పే సవరించి లెవల్ సిక్స్ నుంచి మొదలుకొని 8 వరకు లోకోరన్నింగ్ స్టాఫ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహించే తమపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. రామగుండం బ్రాంచ్ సెక్రటరీ సీహెచ్‌రవి, సచిన్, పురుషోత్తం మీనా, పల్లికొండ శంతన్‌కుమార్, కిరణ్, ప్రేమ్, రఫీ పాల్గొన్నారు.


