పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ జరగక ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 12వ బస్‌డిపోను పెద్దపల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చి పనులు చేపట్టడంతో దానిని ఆనుకునే ఉన్న శ్రీపెద్దశ్రీపల్లి బస్టాండ్‌ను ఆధునీకరిస్తారనే ఆశ ఈ ప్రాంత ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఈ బస్టాండ్ ఉండడంతో దూర, సుదూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు సైతం పెద్దపల్లి వరకు ఆర్టీసీ బస్సుల్లోనే చేరుకుంటుండడంతో రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం దాదాపు 500 పైగా ట్రిప్పులతో 12వేల నుంచి 15వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని అంచనా.
పలు డిపోల నుంచే 382 ట్రిప్పులు
పెద్దపల్లి బస్టాండ్ మీదుగా నిత్యం జిల్లాలోని కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, హుస్నాబాద్, హుజురాబాద్, మంథని, ఆసిఫాబాద్ తదితర డిపోలకు చెందిన బస్సులే 382 ట్రిప్పులు నడుస్తుంటాయి. ఈ బస్సుల్లో కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇవి కాకుండా మరో వంద ట్రిప్పుల వరకు పెద్దపల్లి, దాని చుట్టూ ఉన్న పరిసర మండలాలు, గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. బస్టాండ్ నుంచి యైటింక్లయిన్‌కాలనీకి రోజూ 30 ట్రిప్పులు, దొంగతుర్తి, ధర్మారంకు 19 ట్రిప్పులు నడుస్తున్నాయి.
బస్‌డిపో ఏర్పాటుతో పెరగనున్న బస్సులు
పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సుడిపో మంజూరు కావడంతో పనులు మొదలయ్యాయి. పనులు కాస్త నెమ్మదించినా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, విప్ విజయరమణారావు పనులు పొందిన కాంట్రాక్టర్‌పై ఒత్తిడి పెంచడంతో చకచకా సాగుతున్నాయి. ఈ డిపో అందుబాటులోకి వస్తే 52 బస్సులను పెద్దపల్లి డిపోకు ఆర్టీసీ అధికారులు కేటాయించనున్నారు.
ఫ్లాట్‌ఫాంల విస్తరణ అవసరం
పెద్దపల్లి బస్టాండ్‌లో కేవలం ఆరు ఫ్లాట్‌ఫాంలే ఉన్నాయి. దీంతో బస్సులను బస్టాండ్‌లోని ఖాళీ ప్రదేశాల్లోనే నిలపాల్సి వస్తోంది. దీంతో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని ఫ్లాట్‌ఫాంలు నిర్మించేలా బస్టాండ్‌ను విస్తరించాల్సిన అవసరముందని ప్రయాణికులు కోరుతున్నారు.
మూత్రశాలలు శిథిలం
బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు అధ్వానంగా మారాయి. తొట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొ ట్లు లేకండానే మూత్రవిసర్జన చేయాల్సి వస్తోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అయితే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఓ మరుగుదొడ్డిని నిర్మిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రద్దీకి అనుగుణంగా అభివృద్ధికి నోచని వైనం
మరిన్ని ఫ్లాట్‌ఫాంలు అవసరం
నిత్యం 500 వరకు ట్రిప్పులు.. 15వేల మంది ప్రయాణం


