మంథని: బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో జైల్‌భరో నిర్వహించారు. పట్టణంలో భారీనిరసన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో నాయకులు బూడిద గణేశ్, ఆర్ల సందీప్, వనజారాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తోందన్నారు. భారత స్వాతంత్య్ర సమరంలోని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుతో రైతులపై భారం మోపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసే యత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విత్తన చట్టం ద్వారా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. నాయకులు కొమురయ్య, వేల్పుల సురేశ్, బాబు రవి, ఉప్పు రమేశ్, కుమార్, పాషా, సులోచన, శ్యామల, సుగుణ, శోభ, హరిత, మున్సిపల్ కార్మికులు తదితరులు ఉన్నారు.


