మంథని: తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా వరుస చోరీలు చేస్తున్న కేసులో నిందితుడిని పెద్దపల్లి జిల్లా మంథ ని సీఐ స్వామి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రా మగిరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. కేసు వివరాలను గోదావరిఖని ఏసీపీ రమేశ్ శనివా రం మంథని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాళంవేసిన ఇళ్లను పగలు గమనించి రాత్రి తాళాలు పగులగొట్టి ఆభరణాలు, నగదు చోరీ చేస్తున్నాడు. రామగిరి ఎస్సై శ్రీనివాస్ శనివారం గస్తీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి చూసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అతడిని తనిఖీ చేయగా బటన్ కత్తి లభించింది. తన పేరు వనం రాము అని, జగిత్యాల జిల్లా తారకరామనగర్ స్వస్థలమని వెల్లడించాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనభార్య కవితతోపాటు దాసరి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన వనం పాపయ్య, అశ్వరావుపేటకు చెందిన వనం నగేశ్‌తో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నాడు. గతంలో రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో కూడా చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. రామగిరి మండలం కల్వచర్ల, ముత్తారం, ధర్మారం, రత్నాపురం, జూలపల్లిలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేశారు.
చోరీచేసిన ఆభరణాల తాకట్టు, విక్రయం
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో దొంగిలించిన నల్లపూసల గొలుసు, కల్వచర్లలో చోరీచేసి ఆభరణాలను జగిత్యాలలో తాకట్టు పెట్టినట్లు నిందితుడు తెలిపాడు. వాటి ద్వారా వచ్చిన నగదును ఎన్నికల సమయంలో ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. మరికొన్ని ఆభరణాలను జగిత్యాల టవర్ సర్కిల్‌లోని నగల దుకాణాదారుకు విక్రయించినట్లు, ఆ వ్యక్తి కొన్ని నెలల క్రితం మృతి చెందినట్లు వివరించాడు. ఆభరణాల విక్రయం ద్వారా వచ్చిన నగదులో కొంతమొత్తాన్ని రవి, పాపయ్య, నగేశ్‌కు ఇచ్చి మిగిలిన సొమ్మును తన భార్య ఖర్చులు, జల్సాలకు వినియోగించినట్లు వెల్లడించాడు. అలాగే ఓడేడులో దొంగిలించిన రూ.లక్షతోపాటు గతంలో దొంగిలించిన నగదును ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడేనికి చెందిన జగన్నాథం లక్ష్మణరావు వద్ద సెప్టిక్ ట్యాంకర్ కొనుగోలు కోసం రూ.2 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, దొంగతనాలకు సంబంధించిన ఆస్తి రికవరీతోపాటు ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ రమేశ్ వివరించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన మంథని సీఐ స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ భార్గవ్, పోలీస్ కానిస్టేబుళ్లు రమేశ్, అభిషేక్, రాజ్‌కుమార్‌ను ఏసీపీ ఈ సందర్భంగా అభినందించారు.


