● పక్కాగా ఎఫ్‌ఎల్‌ఎన్ అమలు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లి: ఎఫ్‌ఎల్‌ఎన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపు సాధ్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలోని 180 ఎఫ్‌ఎల్‌ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యాచరణపై సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను ప్రతీవిద్యార్థి తప్పనిసరిగా సాధించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు తరచూ పాఠశాలలను సందర్శించి ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల అమలు తీరు పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, ఏఎంవో పీఎం షేక్, డీఆర్‌పీలు, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, 180 ఎఫ్‌ఎల్‌ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి
గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, వీబీజీ రామ్ జీ పథకం ద్వారా నీటి సంరక్షణ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో జలసిరిపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో ప్రతిపాదించిన వ్యక్తిగత ఇంకుడుగుంతలు, సామూహిక ఇంకుడుగుంతలు, పంట కుంటల నిర్మాణాలను నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవోలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.


