నవోదయ కావాలి | - | Sakshi
Sakshi News home page

నవోదయ కావాలి

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

ఎంపీ చొరవతోనే సాధ్యమనే అభిప్రాయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నిరాశ

పేద విద్యార్థుల కోసం పెరుగుతున్న డిమాండ్‌

ప్రజాప్రతినిధులు, ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి

నవోదయ విద్యాలయంతో అందనున్న మెరుగైన విద్య

పేద, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్‌కు వరమని అభిప్రాయం

సాక్షి పెద్దపల్లి: పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా, తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అగ్రస్థానాల్లో నిలిచిన పెద్దపల్లి జిల్లాకు ఇప్పటికీ జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు నోచుకోలేదు. జిల్లా ఏర్పడి ఏళ్లు గడిచినా గ్రామీణ ప్రాంతాల పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే నవోదయ విద్యాలయం కోసం ప్రజలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు నిరంతరం డిమాండ్‌ చేస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, కేశోరాం, జెన్‌కో, సింగరేణి వంటి జాతీయ స్థాయి పరిశ్రమలకు నిలయమైన జిల్లా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నా, నవోదయ విద్యాలయానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన నవోదయ సాధనలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యావేత్తలు, ప్రజలు కోరుతున్నారు.

జిల్లాకు నవోదయ విద్యాలయం సాధించడంలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి, నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమావేశమై జిల్లా అవసరాన్ని వివరించడం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి భూ కేటాయింపును వేగవంతం చేయించడం, జిల్లా యంత్రాంగంతో కలిసి మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లాకు నవోదయ మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడతాయని వారు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 9 నవోదయ విద్యాలయాలు ఉండగా, మరో 7 పాఠశాలలకు అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో ఇప్పటికే చాలా జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు విజయవంతంగా కొనసాగుతున్నా, పెద్దపల్లి జిల్లా మాత్రం ఇప్పటికీ ఆ అవకాశానికి దూరంగా ఉండడం విద్యార్థులు, తల్లిదండ్రులను నిరాశకు గురిచేస్తోంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యను భరించే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు నవోదయ విద్యాలయం ఒక గొప్ప అవకాశమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement