గోదావరిఖని: రామగుండం నియోజకవర్గం అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గంలో ప్రతిపాదిత 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం, ఈఎస్‌ఐ హాస్పిటల్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఇతర పనులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు త్వరగా మంజూరై పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా పరిశీలించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
పెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేడుకలు కలెక్టరేట్‌లో జరుగుతాయని, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్, వైద్య శిబిరాలు, అంబులెన్స్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఐటీఐల్లో రెండో దశ ప్రవేశాలకు దరఖాస్తులు
పెద్దపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని ఐటీఐలు, ప్రైవేట్ పాలిటెక్నిక్ సంస్థలు, ఏటీసీల్లో 2026–27 విద్యాసంవత్సరానికి రెండో దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎస్సెస్సీ మెమో తదితర ధ్రువపత్రాలతో iti.telangana.gov.inలో రూ.100 రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు అనంతరం విద్యార్థులు తమ సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి ఈ–మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, జిల్లా పరిశ్రమల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
పెద్దపల్లి: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల వెళ్తున్న సందర్భంగా పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద ఆయనకు బీజేవైఎం నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన రూ.15 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలన్నారు. తమ హక్కులను కోరుతున్న విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్‘గా అభివర్ణించడం సీఎం రేవంత్‌రెడ్డి అహంకారానికి, విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేశాయని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కన్వీనర్ రామగిరి అఖిల్‌కుమార్, ఉప్పు కిరణ్, శివంగారి రాజేశ్, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.


