ఓదెల(పెద్దపల్లి): రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎస్సారెస్పీ నీరందిస్తానని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సభలో మాట్లాడారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు పంటల సాగుకు సరిపోతాయని, మున్ముందు పంటలు ఎండిపోకుండా చివరి భూములకు నీరందిస్తానన్నారు. వచ్చే సమావేశాలకు వ్యవసాయ అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు. కుంటలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతంపై సర్పంచులు తీర్మానం చేసి సంబంధిత అధికారులకు ఇవ్వాలని సూచించారు. రూపునారాయణపేటకు విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరయినట్లు పేర్కొన్నారు. స్థలాన్ని గుర్తించి వేగంగా ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం హరిపురం సర్పంచ్ గ్యారవేని విజయనాగరాజు మాట్లాడుతూ, కొలనూర్ నుంచి హరిపురం దారిలో నాగులకుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జీలకుంట, గోపరపల్లె సర్పంచులు రాగిడి మంగ, మద్దెవెని రవిలు మాట్లాడుతూ, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రంగారెడ్డి, డీఎల్‌పీవో దేవకిదేవి, తహసీల్దార్ వనజానాయక్, ట్రాన్స్‌కో ఏడీఏ రవీందర్, డీఈఈ పద్మ పాల్గొన్నారు.


