● డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత
● ఖండించిన మహంకాళి స్వామి
కోల్‌సిటీ: రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పిక్నిక్‌లో పలువురు కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు భారీసంఖ్యలో హాజరయ్యారు. బసంత్‌నగర్ సమీపంలోని బుగ్గ రామస్వామి ఆలయ పరిసరాల్లోని పిక్నిక్ స్పాట్‌ను సందర్శించిన సందర్భంగా సుమారు 40 మందికిపైగా కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరై సందడి చేశారు.
ప్రజాప్రతినిధుల్లో జోష్..
తమకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు కార్పొరేటర్లు కొద్దిరోజుల క్రితం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్పొరేటర్ల శిక్షణకు కూడా ముగ్గురే హాజరుకాగా, మిగిలినవారు గైర్హాజరై నిరసన తెలిపారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఆధ్వర్యంలో జరిగిన పిక్నిక్‌కు అసంతృప్తి కార్పొరేటర్లతో జతకట్టిన కొందరు కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిని బుజ్జగించడానికే పిక్నిక్ ఏర్పాటు చేశారని ప్రచారం జరిగింది. అయితే పిక్నిక్ జోష్ నింపిందని పలువురు ప్రజాప్రతినిధులు వెల్లడిస్తున్నారు.
డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత
పిక్నిక్‌లో విందు, వినోద కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ప్రచారం జరిగినా... అలాంటిదేమీలేదని మేయర్ మహంకాళి స్వామి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీతోపాటు తమకు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల కార్పొరేటర్లు, తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా గడిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ప్రశాంతంగా, ఆనందంగా కార్యక్రమం ముగిసిందని మేయర్ ‘సాక్షి’కి తెలిపారు.


