కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి జెడ్పీహైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాశ్‌రావు బుధవారం స్కూల్ యూనిఫామ్ ధరించి విధులకు హాజరయ్యారు. విద్యార్థులతో మమేకమై పాఠాలు వింటూ, మొక్కలు నాటారు. తాను చదువుకునే సమయంలో కాళ్లకు కనీసం చెప్పులు, మంచిబట్టలు కూడా లేవని, చిరిగిన దుస్తులు ధరించి బడికి వెళ్లాలనని గుర్తు చేసుకున్నారు. బలపాలు ఉండేవి కావన్నారు. చెక్కపలకపై బొగ్గు, ఆకుపసరుతో అక్షరాలు రాసి చదువుకున్నామని తెలిపారు. కరెంట్ లేదని, కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నామన్నారు. పెన్నులు, పుస్తకాలు ఉండేవి కావని ఆయన చెబుతూ ఉంటే విద్యార్థులు విస్తుపోయారు. తాము అనేక కష్టాలతో విద్యాభ్యాసం చేశామని, ప్రస్తుతం ప్రభుత్వం అన్నీ ఉచితంగా అందిస్తోందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.వేలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చేరవద్దని, సర్కారు బడిలో ఉచిత విద్య నేర్చుకోవాలని సందేశం ఇచ్చేందుకే తాను స్కూల్ విద్యార్థుల యూనిఫాం ధరించి విధులకు హాజరయ్యానని సత్యప్రకాశ్‌రావు అనంతరం విలేకరులకు వివరించారు. ఆయన ఇప్పటికే అనేకమంది పేదల విద్యార్థులకు ఫీజు చెల్లించారు. డిక్షనరీలు, నోటుపుస్తకాలు, విద్యాసామగ్రి ఉచితంగా అందజేశారు. అనేకసార్లు రక్తదానం చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఒకేపేజీలో 12 నెలల క్యాలెండర్ రూపొందించారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఆయనను పలువురు అభినందించారు.


