● ప్రభుత్వ విప్ విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్: పేదవిద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయయరమణారావు అన్నారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లెలో రూ.32 లక్షల వ్యయంతో చేపట్టిన ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతిగదులు, కంప్యూటర్ ల్యాబ్, సోలార్ పవర్ సిస్టమ్, సీసీ రోడ్లు తదితర పనులను సర్పంచు రేకుల జ్యోతితో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, విశాలమైన గదులు, కంప్యూటర్ సాంకేతికతతో డిజిటల్ పాఠాలు చెప్పేస్థాయికి ఊశన్నపల్లి బడి చేరుకుందన్నారు. పందిల్ల, లక్ష్మీపురం, గంగారం, ఊశన్నపల్లె గ్రామస్తుల విజ్ఞప్తి మేర కు డబుల్‌రోడ్డు, కాలువ నుంచి ఎస్సీకాలనీ ద్వారా ఊశన్నపల్లెకు తారురోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు విప్ వెల్లడించారు. తహసీల్దార్ రాముడు, ఎంపీడీవో సురేందర్‌కుమార్, ఎంఈవో మహేశ్‌కుమార్, ఈఈ రమణారెడ్డి, హెచ్‌ఎం సమ్మయ్య, నాయకులు రామిడి తిరుపతిరెడ్డి, సారయ్యగౌడ్, మేడి అశోక్‌గౌడ్, గాజనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు.


