తల్లిపాలే పట్టించాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలే పట్టించాలి

Aug 4 2026 12:29 AM | Updated on Aug 4 2026 12:29 AM

● ముర్రుపాలతో బిడ్డకు వ్యాధి నిరోధకశక్తి ● తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన సదస్సులు ● అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ● ఈనెల 7వతేదీ వరకు వారోత్సవాలు

మెడికోల అవగాహన ర్యాలీ

పెద్దపల్లి/మంథనిరూరల్‌: బిడ్డకు తల్లిపాలు అమృతంలాంటివి. ఆధునిక నాగరికతతో కొందరు తల్లులు తమ పిల్లలకు డబ్బాపాలు పట్టిస్తున్నారు. తద్వారా శిశువులు అనేక వ్యాధులబారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏటా ఆగస్టు 01 నుంచి 07వ తేదీ వరకు ప్రతీఅంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈసారి కూడా జిల్లాలో తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రయోజనాల గురించి వివరిస్తూ..

తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. సిజేరియన్‌, నార్మల్‌ డెలివరీ అయినా తల్లిపాలు పట్టడం చాలాఅవసరమని సూచనలు చేస్తున్నారు. బిడ్డపుట్టాక తల్లికి వచ్చే తొలిపాలను కొలెస్ట్రమ్‌(ముర్రుపాలు) అంటారని, ఇందులో విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్స్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయని, వీటిని పట్టించడం ద్వారా నవజాత శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అవగాహన కల్పిస్తున్నారు.

ముర్రుపాలే వాక్సిన్‌..

అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరునెలల వరకు తల్లిపాలు టీకాలా పని చేస్తాయంటున్నారు. శిశువుకు సమతుల ఆహారం లభించడంతోపాటు కాల్షియం నిల్వలు పెరిగి రక్తహీనతను దూరం చేస్తుంది. ముఖ్యంగా డయేరియా, న్యూమోనియా, గుండెజబ్బులు, ఎలర్జీ, ఆస్తమా, డయాబెటిస్‌ వంటి వ్యాధుల నుంచి ముర్రుపాలు రక్షణ కల్పిస్తాయంటూ అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు తల్లులకు అవగాహన కల్పిస్తున్నారు.

పాలిస్తే తల్లికి ప్రయోజనమే

శిశువులకు పాలిచ్చే తల్లులకూ ప్రయోజనమే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పాలు పట్టించ డం ద్వారా తల్లిఆరోగ్యం మెరుగవుతుందని, రోజూ 8 నుంచి 12సార్లు తల్లిపాలు పట్టించేలా తల్లి పోషకాహారం తీసుకోవడంతోపాటు ఎక్కువనీరు తాగు తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని వివరిస్తున్నారు.

కోల్‌సిటీ: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిమ్స్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీ జంక్షన్‌ వరకు ర్యాలీ సాగింది. ప్రిన్సిపాల్‌ దయాళ్‌ సింగ్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ హిమబిందుసింగ్‌ మాట్లాడుతూ.. శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టిస్తే శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, వైద్యులు, మెడికోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement