● నాందేడ్ – తిరుచానూరు మధ్య రాకపోకలు
● వారంలో రెండుపర్యాయాలు అందుబాటులో
● ఉమ్మడి జిల్లా భక్తులకు ప్రయాణ సౌకర్యం
కరీంనగర్‌రూరల్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల భక్తుల కోసం మంగళవారం నుంచి నాందేడ్ –తిరుచానూరు ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.30 గంటలకు వచ్చిన ప్రత్యేక రైలుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్వాగతంపలికారు. వారంలో రెండు పర్యాయాలు రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతీమంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి బుధవారం ఉదయం 11గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. ప్రతీ బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు తిరుచానూరులో బయలుదేరి గురువారం ఉదయం 8 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ప్రత్యేక రైలు (07603) ఈనెల 21 నుంచి ఆగస్టు 25 వరకు ప్రతీ మంగళవారం నడుస్తుంది. తిరుచానూరు–నాందేడ్ రైలు(07604) ఈ నెల 22 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ముద్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రతీ మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లకు 18.30 గంటలకు, జగిత్యాలకు 19 గంటలకు, కరీంనగర్‌కు 20.28 గంటలకు, పెద్దపల్లికి 21గంటలకు, జమ్మికుంటకు 22 గంటలకు చేరుకుంటుంది. కేవలం ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, జనరల్ కోచ్‌లుండవని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ మేనేజరు భానుచందర్ తెలిపారు.


