మా పిల్లలు ఎలా చదువుతున్నారు? | - | Sakshi
Sakshi News home page

మా పిల్లలు ఎలా చదువుతున్నారు?

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

మంథనిరూరల్‌: సర్కారు బడుల బలోపేతం నాణ్యమైన విద్యాబోధన దిశగా కృషి చేస్తున్న ప్రభుత్వం, విద్యాశాఖ.. మరోఅడుగు ముందుకు వేశాయి. ప్రతీవిద్యార్ధి ప్రగతి తెలుసుకునేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులనూ భాగస్వాములను చేసేలా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌కు శ్రీకారం చుట్టాయి. జిల్లాలోని 530 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీనెల మూడోశనివారం సమావేశాలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాయి.

తల్లిదండ్రుల పాత్ర కీలకమనే..

విద్యార్ధుల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని విద్యాశాఖ భావిస్తోంది. పాఠశాలలో పిల్లలు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడం, ఇంటివద్ద చదువుకు ఆటంకం కలుగకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పేరెంట్స్‌ మీటింగ్‌ను మొక్కుబడిగా కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వందశాతం హాజరయ్యేలా ఆదేశాలు జారీచేసింది.

తల్లిదండ్రుల ఎదుటే..

పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశంలో తల్లిదండ్రుల ఎదుటే పిల్లల విద్యాప్రగతి పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులతో చదివించడం, రాయించడం, లెక్కలు చేయించడం, ఇంగ్లిష్‌లో మాట్లాడించడం ద్వారా విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకుంటారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన చిత్రాలు, హస్తకళలు, సైన్స్‌ నమూనాలు ప్రదర్శిస్తారు. దీంతో తమ పిల్లల అభ్యసన సామర్థ్యం అర్థమై ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధానోపాధ్యాయులకు మీటింగ్‌ల బాధ్యతలు అప్పగించి సత్ఫలితాలు సాధించాలని విద్యాశాఖ ఆదేశించినట్లు తెలిసింది.

సాగు కాలం కావడంతో..

ప్రస్తుతం వర్షాకాలం.. సాగు కాలం. రైతులు, రైతు కూలీలు ఈ పనుల్లో బిజీగా ఉంటారు. పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌కు వారు హాజరు కాలేరు. అయినా, వందశాతం హాజరు కావాలనే ఆదేశాలు ఉన్నాయి. హెచ్‌ఎంలు విస్తృతంగా ప్రచారం చేసినా తల్లిదండ్రులు మొగ్గు చూపిన దాఖలాలు కనిపించలేదు. కొన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు ఆసక్తి చూపినా.. మరికొన్నిచోట్ల తక్కువశాతం హాజరయ్యారు.

తల్లిదండ్రుల వాగ్దానమే ప్రధాన ఎజెండా..

ప్రతీ పాఠశాలలో నిర్వహించే పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లో తల్లిదండ్రుల వాగ్దానమే ప్రధాన ఎజెండాగా చర్చిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరు వాగ్దానాలు చేయాలి. ‘మా పిల్లలను ప్రతీరోజు బడికి పంపుతాం.. వారు బడికి రాకపోతే టీచర్లకు ముందుగానే తెలియజేస్తాం.. నేను ప్రతీరోజు పిల్లవాడిని ఇంటి వద్ద చదివిస్తా.. ఈ సంవత్సరం ప్రతీపీటీఎంకు హాజరై నా పిల్లల చదువు, ప్రవర్తనపై చర్చిస్తా.. నేను నెలకోసారి బడికి వెళ్లి పిల్లల ప్రగతిపై టీచర్లతో వ్యక్తిగతంగా చర్చిస్తా’ అనే వాగ్దానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇళ్ల వద్ద మేం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

ఇకనుంచి సర్కారు బడుల్లో మూడోశనివారం పీటీఎం

సమావేశంలో తల్లిదండ్రుల హామీనే ప్రధాన ఎజెండా

ప్రతీస్కూల్‌లో పకడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు

పకడ్బందీగా నిర్వహిస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకునేలా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ను పకడ్బందీగా నిర్వహిస్తాం. గతంలోనూ మీటింగ్‌లు నిర్వహించాం. ఈసారి ప్రత్యేకంగా మూడోశనివారం పీటీఎం నిర్వహించి పిల్లల ప్రగతిని తల్లిదండ్రులు స్వయంగా చూసేలా చర్యలు తీసుకుంటున్నాం. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.

– శారద, జిల్లా విద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement