గంభీరావుపేట(సిరిసిల్ల): ఆ ఇళ్లలో ఒక్కగానొక్క కొడుకులు.. కుటుంబాలకు అండగా నిలవాల్సిన వయస్సు.. భవిష్యత్‌పై ఎన్నో కలలు.. కానీ, విధి ఒక్క క్షణంలో అన్నింటినీ ఛిద్రం చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నెల రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో సంఘటన స్థలంలో గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన కోట అనిల్, రెండ్రోజుల తర్వాత ఆస్పత్రిలో అన్వేశ్‌గౌడ్ మృతిచెందారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు దుంపల వికాస్ మంగళవారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు త్వరగా వస్తాం.. అని చెప్పిన మాటలే వారి చివరి మాటలయ్యాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా.. కుటుంబసభ్యులు దుఃఖాన్ని దిగమింగుకోలేకపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం.. అతివేగం.. మూడు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ముగ్గురి కోసం ఎదురుచూసిన ఇళ్లలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
రోడ్డు ప్రమాదంలో మొన్న ఇద్దరు..
చికిత్స పొందుతూ నేడు మరో యువకుడు మృతి


