సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
పెద్దపల్లి: ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజావాణి ద్వారా ఆయన సోమవారం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన ఇండ్ల కొమురయ్య తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తుమ్మ ల సుధాకర్‌రెడ్డి.. ఇతరుల పేరిట ఉన్న సర్వే నంబర్ 204లో 20 గుంటలను తన పేరిట నమోదు చేయాలని, మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఇందారపు శంకరమ్మ.. తన ఇల్లు కాలిపోయిందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన ఉమ్మగాని సమ్మయ్య తన పేరిట ఉన్న గుంటభూమి కోసం తన కుమారుడు దాడి చేస్తున్నాడని, రక్షించాలని కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా, యువత కోసం ఈనెల 7న కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. వందశాత జాబ్ గ్యారంటీతో వివిధ కోర్సులు అందిస్తున్నారని, వీటిపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
నైపుణ్య శిక్షణతో ఉపాధి
ఏటీసీలో నైపుణ్య శిక్షణ పొందిన యువతకు మంచి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక ఐటీఐలోని ఏటీసీని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, ట్రైనింగ్ అధికారులు శ్రీనివాసు, మల్లికార్జున్, సూపరింటెండెంట్ కృష్ణ వేణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చివరి ఆయకట్టుకు సాగునీరు
చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులతో ఆ యన సమీక్షించారు. వచ్చే ఏప్రిల్ వరకు యాసంగి పంటలకు ఏడు తడుల సాగునీరు అందుంతున్నారు. ఎస్సారెస్పీ డీ–83, డీ–86 కాలువల మ రమ్మతు చేయాలని సూచించారు. డీఏవో శ్రీనివాస్, ఇంజినీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


