పులి జాడ కోసం అన్వేషణ
మంథనిరూరల్: రామగుండం ఓపెన్‌కాస్ట్ ఏరియాలో పులి సంచరిస్తుందన్న ప్రచారంతో మంథని అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండురోజులుగా పులి అడుగుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. రామగుండం నుంచి అడవిసోమన్‌పల్లి వరకు గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లో ఇన్‌చార్జి ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ రమేశ్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారుల బృందం పర్యటిస్తూ ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
గోదావరి అవతలివైపు నుంచి వచ్చిందా?
గోదావరి నది అవతలివైపు నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పులి.. సింగరేణిలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో సంచరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పులి రామగుండం ఓపెన్‌కాస్ట్‌ల మీదుగా మంథని వైపు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. గతేడాది సైతం మహాముత్తారం అడవుల నుంచి చిన్నఓదాల అడవుల్లోకి ప్రవేశించిందని, ఆ తర్వాత కొద్దిరోజులకే మళ్లీ వెళ్లిపోయిందని అటవీ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓపెన్‌కాస్ట్‌ల మీదుగా ఇటువైపు వచ్చిందా? అనే కోణంలో నదీతీర ప్రాంతంలో పులి అడుగుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
అభయారణ్యంలోకి ఇసుక రీచ్?
మంథని మండలం విలోచవరం గోదావరి నదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ అభయారణ్యం పరిధిలోని వస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్‌లకు పులి సంచారంపై అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయరాదని, అభయారణ్యం పరిధిలో వాహనాలు నడపరాదని వివరించారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యల దృష్ట్యా ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని అధికారులు సూచించారు.
పులి సంచారంపై అధికారుల అప్రమత్తం
గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లో గాలింపు


