గోదావరి దాటిన పులి
గోదావరిఖని/జ్యోతినగర్: సుమారు పదిరోజులుగా గోదావరినదీతీర ప్రాంత ప్రజల కంటిమీద కునుకులేకుండా చేసిన పులి ఎట్టకేలకు నది దాటి అవతలివైపు వెళ్లినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈనెల 14న మంచిర్యాల జిల్లా శ్రీరాపూర్ ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు చొరబడిన పులి.. మూసివేసిన సింగరేణి మేడిపల్లి ఓసీపీ డంప్–1లో తలదాచుకుంది. అనంతరం మల్యాలపల్లె సమీప బీపీఎల్ ఖాళీ స్థలంలో సంచరించింది.
పులి సంచారం.. ప్రజల్లో భయం
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న సమాచారంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మల్కాపూర్, మేడిపల్లి, లింగాపూర్, మల్యాలపల్లె, గోలివాడ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలియడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజ లను హెచ్చరిస్తూ పులి కదలికలను నిపుణులతో ప ర్యవేక్షించారు. పదిరోజుల పాటు సంచరించినా.. ఒక్కప్రాణికి కూడా హాని చేయలేదు. దీంతో పులి ఎలాంటి ఆహారం తీసుకుందనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం ఫారె స్ట్ ప్రాంతానికి పులి వెళ్లిందని అటవీ అధికారులు నిర్ధారించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
అధికారుల అప్రమత్తత..
పులి సంచారంతో జిల్లా అటవీ అధికారి శివయ్య నే తృత్వంలో ఎఫ్‌ఆర్‌వోలు సతీశ్‌కుమార్, కొముర య్య, రహమతుల్లా, మల్లేశ్ తదితరులు, నిపుణులు పులి సంచారంపై రోజూ తనిఖీలు చేశారు. అది ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందనే దానిపై నిత్యం పర్యవేక్షణ చేశారు. గ్రామాల్లో డప్పు చాటింపుతోపాటు పోస్టర్లు అంటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పులి సంచారం తెలిస్తే.. అధికారులకు సమాచారం అందించాలని, మొబైల్ నంబర్లను ప్రకటించి ప్రజలకు భరోసా కల్పించారు.


