ఆశలు ఆవిరి
పెద్దపల్లిరూరల్: తమ ఇంట తెల్లబంగారం సిరులు కురిపిస్తుందని ఆశిస్తే.. అందులో సగం కూడా దిగుబడి రాలేదని జిల్లాలో పత్తిసాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈఏడాది జిల్లావ్యాస్తంగా 48,215 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగుచేశారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. తద్వారా 5,78,580 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనాకు వచ్చారు. సీజన్ చివరి దశకు వచ్చినా ఇప్ప టివరకు కేవలం 1,15,000 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో సీసీఐ 61వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 54వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారవర్గాల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇంకా దిగుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించక పోవడంతో పత్తి రైతుల్లో నైరాశ్యం నెలకొంది. ఎకరాలో కనీసం మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి నష్టపోవాల్సి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రైవేట్ వ్యాపారులు కూడా దాదాపుగా సీసీఐకి సమానంగా ధరలు చెల్లించినా.. దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
దిగుబడులు చివరిదశకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి ధరలు పెరుగుతుండడం అన్నదాతను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అనేక కష్టనష్టాలకు ఓర్చిన రైతులు.. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ, పలు తెగుళ్లతో దిగుబడి పడిపోవడం, ఇప్పుడు ధరలు పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జిల్లా సీసీఐ ప్రైవేట్
పెద్దపల్లి 61,000 54,000
కరీంనగర్ 1,53,000 62,000
సిరిసిల్ల 1,79,000 39,200
జగిత్యాల 9,400 11,000
క్వింటాల్ పత్తి రూ.7,418
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,418 ధర పలికింది. కనిష్టం రూ.6,651, సగటు రూ.7,151గా ధర నమోదైందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 162 మంది రైతులు తీసుకొచ్చిన 680 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.
ఆశలు ఆవిరి


