నెల్లిమర్ల రూరల్: ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో ఇటీవల జరిగిన జూనియర్ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2026లో నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ శనపతి గురునాయుడు రెండు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. విజయం అనంతరం స్వగ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు, యువత ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం విజయనగరం రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి గురునాయుడికి వీరతిలకం దిద్ది అభినందనలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నెల్లిమర్ల మీదుగా చంద్రంపేట గ్రామం వరకు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


