పుస్తెల తాడు దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పుస్తెల తాడు దొంగల అరెస్ట్‌

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురంలో రైల్వే వంతె కింద పాన్‌ షాప్‌ నడుపుతున్న కె.కృష్ణకుమారి మెడలో ఉన్న పుస్తెల తాడును తెంచుకుని వెళ్లిన దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై పెదమానాపురం పోలీస్‌స్టేషన్‌లో గజపతినగరం సీఐ సన్యాశినాయుడు, ఎస్సై కళాధర్‌లు బుధవారం మాట్లాడుతూ చైయిన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితుడైన దత్తిరాజేరు మండలం ఆర్‌. రామచంద్రాపురానికి చెందిన కేతల దుర్గారావును (ప్రస్తుతం శివశక్తి నగర్‌ కొమ్మాది వైజాగ్‌ నివాసి) నిందితుడికి సహకరించిన శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టి మండలానికి చెందిన పైడి వసుంధర, శ్రీకాకుళానికి చెందిన మల్లెపు అనసూయలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.

యువత హెచ్‌ఐవీపై అవగాహన కల్పించుకోవాలి

జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ గౌరి

విజయనగరం ఫోర్ట్‌: యువత హెచ్‌ఐవీపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ కె. గౌరి అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై రూపొందించిన వాల్‌ పోస్టర్స్‌ ఆవిష్కరణ కార్యక్రమం, అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ హెచ్‌ఐవీ, క్షయ వ్యాధి గురించి తెలుసుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని, వివక్షచూపితే చట్ట ప్రకారం శిక్షర్హాలవుతారన్నారు. హెచ్‌ఐవీ రోగుల పట్ల ప్రేమ, అప్యాయత చూపించాలని కోరారు. హెచ్‌ఐవీ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడి, మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో కశాశాల ప్రిన్సిపాల్‌ రేఖ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కేసులో

నిందితులకు ఏడాది జైలు

విజయనగరం టౌన్‌: గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలుశిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ ఫస్ట్‌ క్లాస్‌ ఏడీజే కమ్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ స్పెషల్‌ జడ్జి కె.విజయ కల్యాణి బుధవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ పేర్కొన్నారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన పవన్‌ కుమార్‌, మోహన్‌ శ్యామ్‌ అనే ఇద్దరు వ్యక్తులు రెండు కిలోల గంజాయితో బొబ్బిలి రైల్వేస్టేషన్‌ వద్ద 2025 డిసెంబరు 18న అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు వచ్చిన కచ్చితమైన సమాచారంతో బొబ్బిలి పోలీసులు తనిఖీ చేపట్టి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. అప్పటి బొబ్బిలి సీఐ కె.సతీష్‌ కుమార్‌ నిందితులను రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుత బొబ్బిలి సీఐ కె.నారాయణరావు నిందితులపై న్యాయస్ధానంలో అభియోగపత్రాలు దాఖలు చేసి, ప్రాసిక్యూషన్‌ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. కేసు విచారణలో ఇద్దరు నిందితులపై నేరం రుజువు కావడంతో పై విధంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

డెంకాడ: మండలంలోని మోదవలస వద్ద కారు ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్‌ యాదవ్‌(41) మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై ఎ.సన్యాసి నాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సంజయ్‌ యాదవ్‌ కుటుంబంతో కలిసి దాకమర్రి వద్ద ఉంటున్నాడు. ఆయన మోపాడ గ్రామం సమీపంలో ఉన్న ప్‌లైవుడ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీలో విధులు నిర్వహించేందుకు మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. మోదవలస పంచాయతీ పరిధిలోని టీటైమ్‌ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖ నుంచి విజయనగరం వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో సంజయ్‌ యాదవ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య అనితాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement