భూములన్నీ కేశవాయ స్వాహా! | - | Sakshi
Sakshi News home page

భూములన్నీ కేశవాయ స్వాహా!

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

ఆక్రమణలపై దర్యాప్తు నిర్వహించాలి...

మక్కువ: పేరులో దైవత్వం.. ఆయన చేసే పనులు చూస్తే నీచం. ప్రభుత్వ స్థలాలు, కాలువగట్లు, చెరువు గర్భాలు.. ఇలా ఒకటేమిటి.. ఆయన కన్నుపడిందంటే కబ్జాకావాల్సిందే. నిర్మాణాలు జరగాల్సిందే. ప్రభుత్వ స్థలాల్లో కోళ్లఫారాలు, దాబాలు, దుకాణాలు నిర్మించడం.. అద్దెలకిచ్చి డబ్బులు ఆర్జించడం, అనుమానం వస్తే గుట్టుచప్పుడుగా అమ్మేయడం ఆయనకు నిత్యకృత్యం. పొరపాటున ఎవరైనా పేదవారు ఆయన దుకాణం పక్కనే చిన్న గుడిసె వేసినా ఊరుకోడు. వెంటనే అధికార బలంతో దౌర్జన్యం చేసి తొలగిస్తాడు. ప్రభుత్వ స్థలాలన్నీ తమవే అని... తాను మాత్రమే ఆక్రమించేందుకు అర్హుడినని, అధికారులెవరూ తమను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తంచేస్తాడు. ఆయన ఆగడాలను చూసిన మక్కువ వాసులు ‘కేశవా’.. ఇదెక్కడి అన్యాయమయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు. నీకో దండం అంటూ చేతులజోడిస్తున్నారు. అసలు అధికారులు పనిచేస్తున్నారా?లేదా?.. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నా పట్టించుకోరా అన్న సందేహం వ్యక్తంచేస్తున్నారు. చోటా నాయకుడి ఆక్రమణలు, అక్రమాలపై మక్కువకు చెందిన అశ్వినీదత్‌ అనే వ్యక్తి పార్వతీపురంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఇటీవల ఫిర్యాదు చేయడం గమనార్హం. అక్రమాల చిట్టాను అధికారులకు అందజేశారు. స్థానిక విలేకరులకు స్వయంగా చూపించారు. ఇప్పటికైనా ఆక్రమణలను తొలగిస్తారా? అక్రమాలపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. ఓ వ్యక్తి ఇంత స్థాయిలో ఆక్రమణలకు బరితెగిస్తే అధికారులు తమకేమీ పట్టనట్టు ఉండడంపై సభ్యసమాజం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అధికార బలాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడంపై ఆ పార్టీ వర్గాలు సైతం గుర్రుమంటున్నాయి. ఆయన అక్రమాల వల్ల పార్టీకి మచ్చవస్తోందని, పరువుపోతోందని గుసగులాడుతున్నారు.

మక్కువలో బరితెగించిన టీడీపీ చోటా నాయకుడు

ప్రభుత్వ స్థలాలు దర్జాగా కబ్జా

అక్రమంగా వీఆర్‌ఎస్‌ 9ఎల్‌ కాలువపై కాజ్‌వే నిర్మాణం

ప్రభుత్వ స్థలంలో దాబా వ్యాపారం

మేదరగెడ్డ గ్రామకంఠం స్థలంలో పక్కా భవనం నిర్మాణం

చోటానాయకుడి అక్రమాల చిట్టాచూసి విస్తుపోతున్న జనం

నాయుకుడి ఆక్రమణలపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేసిన స్థానికుడు

ఆయన ఓ లీడర్‌నంటూ ఊరిలో హల్‌చల్‌ చేస్తారు. ఖద్దరు చొక్కా వేసుకుని మనసంతా తెలుపు అని అమాయక జనాన్ని నమ్మిస్తారు. అన్యాయమంటే తెలియదంటారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాచేస్తున్నారంటే.. ఛీ.. అదేం పని అంటారు. తరచి చూస్తే... ఆయన చేసినవన్నీ ఆక్రమణలు, అక్రమాలే. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి అక్రమార్జితమే. అధికార బలంతో ఆయన చేసిన కబ్జాలను చూసి మక్కువ వాసులు ముక్కన వేలేసుకుంటున్నారు. ఇదేంపని ‘కేశవా’ అంటూ చెవులు పట్టుకుంటున్నారు. రెండేళ్లలోనే ఇంత బరి తెగిస్తే... పొరపాటున స్థానిక సంస్థల్లో ఆయనకు వార్డు మెంబర్‌ పదవి ఇచ్చినా జనం ఆస్తులు, సర్కారు భూములు, సర్కారు నుంచి పంచాయతీకి వచ్చే నిధులను దోచుకుంటారని బెంగపడుతున్నారు.

ఈ దుకాణాలు చూశారా... ఇవి చెముడు ఆర్‌అండ్‌బీ రోడ్డు స్థలంలో టీడీపీ చోటానాయకుడు అక్రమంగా రెండు దుకాణాలను నిర్మించారు. వాటిని అద్దెకు ఇచ్చి సొమ్ముచేసుకుంటున్నాడు. ఇప్పుడు అవి అక్రమమని తేలడంతో ఆ దుకాణాలను విక్రయించేందుకు బేరం పెట్టినట్టు సమాచారం.

మక్కువకు చెందిన టీడీపీ నాయుకుడు గతంలోనూ కాశీపట్నం గ్రామ సమీపంలో డీ పట్టాభూమిని తక్కువ ధరకు కొనుగోలుచేసి, ఆ స్థలంలో కోళ్లఫారంను నిర్మించి, తరువాత అధికమొత్తంలో మరో వ్యక్తికి విక్రయించాడు. ఇప్పుడు మక్కువలో ప్రభుత్వ స్థలాలను కబ్జాచేస్తున్నా అధికారులు మిన్నకుండడం సరికాదు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, దర్యాప్తు నిర్వహించాలి. ఆయన ఆక్రమణల చిట్టాను కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి వివరించాం.

– మావుడి అశ్వనీదత్‌, మక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement