పార్వతీపురం రూరల్/బలిజిపేట : పార్వతీపురం మండలంలోని డోకిశీల, గోచెక్క, గంగపురం, ములగ తదితర పంచాయతీల పరిధి గిరిజన గ్రామాల్లో గుక్కెడు శుద్ధ జలంకోసం జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరైన నిర్వహణ లేక కప్పలు, పురుగులతో నిండిన కలుషిత జలాలను తాగి గిరిజనులు రోగాల బారిన పడుతున్నారు. అరకొర నీటి సరఫరా, క్లోరినేషన్ లేమి కారణంగా ఆయా పల్లెల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత ప్రభుత్వంలో చేతి బోర్లకు మోటార్లు అమర్చి, గ్రామాలకు తాగునీరు అందించేందుకు ట్యాంకులను ఏర్పాటు చేశారు. కాలక్రమేణ నిర్వహణ లోపం కారణంగా వీటికి కనీసం మూతలు లేకపోవడంతో చెత్తాచెదారం, ఆకులు పడి నీరు కలుషితమవుతోంది. దీనికి తోడు కనీసం పది బిందెల నీరు కూడా రాకపోవడంతో దాహార్తి తీవ్రమైంది. గత్యంతరం లేక కొన్నిచోట్ల ప్రజలే సొంతంగా ట్యాంకులకు మూతలు ఏర్పాటు చేసుకుని, ఆ మూతలపై గాలికి ఎగరకుండా రాళ్లు పెట్టుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో గెడ్డల సమీపాన ఉన్న మోటార్ల నుంచి వచ్చే పైపులైన్లు సైతం దెబ్బతినడంతో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. బలిజిపేట, సీతానగరం మండలాల్లోనూ నీటి ఇబ్బందులున్నాయి.
పెద్దింపేట గ్రామంలో రక్షిత మంచినీటి పథకం లేదు. వీధి బోరు నీరే తాగాల్సిన పరిస్థితులు. కొంతమంది నివాసగృహాలలో బోరునీరు తాగుతున్నారు. కొంతమంది 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పొలాల్లోకి వెళ్లి బోరుబావి నీరు తెచ్చుకుంటున్నాం. గ్రామంలో ఆరు బోర్లు ఉన్నాయి. వీటిలో నాలుగే పనిచేస్తున్నాయి. బీసీ కాలనీలో బోరు పాడవ్వడంతో అనేక సార్లు ఫిర్యాదు చేశాం. ఫలితం లేదు.
– ఎం.జనార్దనరావు,
పెద్దింపేట, బలిజిపేట మండలం
మాది సీతానగరం మండలం చినభోగిలి ఎస్సీ వీధి. చాలా కాలంగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. గతంలో కుళా యిలు వేశారు గానీ, వాటి నుంచి నీరు రావడం లేదు. సిబ్బందిని అడిగితే, బాగు చేయడానికి వెయ్యి రూపాయలు కూడా లేవు.. దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు. నీటి కోసం పక్కనే ఉన్న పల్లి వీధి, గొల్ల వీధి వెళ్తున్నాం. కొన్ని సందర్భాల్లో అక్కడ గొడవలు జరుగుతున్నాయి.
– కంట కృష్ణవేణి, చినభోగిలి
●


