వాస్తవం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల కాలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన చర్యలు శూన్యం. సాక్షాత్తూ ప్రకటన చేసిన గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత జిల్లాలోనే తీవ్ర తాగునీటి సమస్య ఉంది. గిరిజన ప్రాంతాలలో నేటికీ చలమ, బావి నీరు దిక్కు అవుతోంది. రక్షిత మంచినీటి పథకాలు నిర్వహణ లేక, అధ్వాన స్థితిలో ఉన్నాయి. గిరిజన గూడలు, పల్లెలే కాదు.. మైదాన ప్రాంతాలు, పట్టణాల్లో సైతం సురక్షిత నీరు అందడం లేదు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోనే కుళాయిల ద్వారా బురద నీరు సరఫరా అవుతోంది. అది కూడా రోజుల తరబడి రాదన్నది జనం మాట.
‘ ఈ రోజు మీరు ఏ గిరిజన గ్రామానికై నా వెళ్లండి. కచ్చితంగా తాగునీరు ఉంటోంది. ఇంతకుముందు తాగునీరు కూడా లేదు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల కిందట ఇదే గిరిజన దినోత్సవం రోజున మాట్లాడుకున్నాం. వెయ్యి గ్రామాలకు తాగునీరు లేదంటే.. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేశారు. ఈ రోజు అన్ని గ్రామాలకూ, గిరిజన గ్రామాలకు తాగునీరు వచ్చింది అంటే.. చంద్రబాబు నాయుడు వల్లే..’
– ఇటీవల గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు ఇవీ..


