పార్వతీపురం రూరల్ : జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం – 2ను మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆదేశాల మేరకు హాస్టల్‌ను సందర్శించిన ఆమె విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలు, వసతిగృహంలో పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు తనిఖీల్లో భాగంగా హాస్టల్ గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించి, నిర్వాహకులను పిలిచి విద్యార్థులకు అందిస్తున్న రోజువారీ భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో ఆమె నేరుగా ముఖాముఖి మాట్లాడారు. నిబంధనల ప్రకారం మెనూను పాటిస్తున్నారా.. లేదా? రోజూ సరైన భోజనం పెడుతున్నారా లేదా? అని విద్యార్థినులను అడిగి నిర్ధారించుకున్నారు. వసతిగృహంలో పరిశుభ్రత పాటిస్తున్న తీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ గదులతో పాటు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆమె హితవు పలికారు.


