లక్షణంగా రప్పించి పొమ్మన్నారు..! | - | Sakshi
Sakshi News home page

లక్షణంగా రప్పించి పొమ్మన్నారు..!

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

లక్షణంగా రప్పించి పొమ్మన్నారు..!

రాజాం: అంతన్నారు..ఇంతన్నారు..చివరకు చేతులెత్తేశారు..లక్ష రూపాయల ప్రైజ్‌ మనీ అంటూ ప్రచారం చేసి విద్యార్థులను ఆశపెట్టారు. పలుచోట్ల పోటీ పరీక్షలు పెట్టి విజేతలను ఎంపికచేసి, వివరాలు ప్రకటించారు. ప్రైజ్‌ మనీ మాత్రం ఇంతవరకూ ఇవ్వలేదు. ఈ తంతు ఎక్కడో జరగలేదు..జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్‌ పోర్టు సందర్భంగా విద్యాశాఖ అధికారులు, జిల్లా అధికారులు చేసిన తతంగం. జిల్లాలో ఎయిర్‌పోర్టు ప్రారంభం సందర్భంగా నెలరోజుల ముందునుంచే ఆర్భాటం చేశారు. రూ.30 కోట్ల మేర ఖర్చు చేశారు. ఈ హడావుడిని విద్యాశాఖ మరింత ఎక్కువచేసింది. లోకేష్‌ బాబు చూస్తాడనో మెచ్చకుంటాడనో గొప్పలకు పోయింది. జిల్లా వ్యాప్తంగా తొలుత మండల స్థాయి, అనంతరం జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, ట్యాగ్‌లైన్‌ పోటీలను పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించింది. మండలంలో ప్రతి పోటీకి ఒక్కో విజేతను ఎంపికచేశారు. అనంతరం వారందరికి జిల్లా స్థాయిలో నిర్వహించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపికచేశారు. వారిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.1 లక్ష ప్రైజ్‌ మనీ ప్రకటించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలకు సైతం ప్రైజ్‌లు ఇస్తామని (నగదు ఎంతనేది చెప్పలేదు) అన్నారు. ఇలా నాలుగు విభాగాల్లో పాఠశాల, కళాశాల స్థాయిలో జిల్లా విజేతలతో పాటు మండల స్థాయిలో నాలుగు విభాగాల్లోని విజేతలను జూలై 31న భోగాపురం రావాలని పిలిచారు. ముందురోజు బహుమతులు ఇస్తామని, విద్యాశాఖ అధికారులతో సత్కారాలు జరుగుతాయని ఆర్బాటం చేశారు. సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వారిని భోగాపురం తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత వారిని పట్టించుకోకపోగా, పోగ్రాం క్యాన్సిల్‌ అయ్యిందని, ప్రైజ్‌లు ఇంటికి పంపిస్తామని చెప్పి విద్యార్థులను వెనక్కు పంపించేశారు. ఆ సమయంలో బస్సులు లేక, అక్కడ వసతి లేక అటు విద్యార్థులు, ఇటు వారిని తీసుకెళ్లిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ రాత్రి నానా అవస్థలు పడి, పైవేట్‌ వాహనాలు ద్వారా ఇంటికి చేరుకున్నారు. వేలరూపాయల చేతిచమురు వదిలించుకున్నారు. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ అంటూ భారీ ప్రచారం చేసి, పోటీలు నిర్వహించి, విద్యార్థులకు ఆశలు పెట్టిన అధికారులు ఇంతవరకూ ప్రైజ్‌ మనీ విద్యార్థులకు అందించలేదు. భోగాపురం వెళ్లిన వారిని కనీసం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రభుత్వ విద్యాశాఖ తీరు అంటూ మండిపడుతున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

భోగాపురం ఎయిర్‌పోర్టు ఓపెనింగ్‌ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించడం, విజేతలను భోగాపురం రమ్మని చెప్పడంపై జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు వివరణ ఇచ్చేందుకు ఫోన్‌ లిఫ్ట్‌చేసేందుకు నిరాకరించారు. రాజాం ఎంఈఓలు ప్రవీణ్‌కుమార్‌, యాగాటి దుర్గారావుల వద్ద సాక్షి ప్రస్తావించగా, మండల స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించామని, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.లక్ష ప్రైజ్‌మనీ ఇస్తామన్నారని చెప్పారు. మండల స్థాయి విజేతలను సైతం భోగాపురం రమ్మన్నారని, ఎటువంటి ప్రైజ్‌లు ఇంతవరకూ ఇవ్వని విషయం వాస్తవమేనని వెల్లడించారు. ఉన్నతాధికారులకు ఈ విషయంపై సమాచారం ఇచ్చామని, త్వరలో బహుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు.

ప్రైజ్‌మనీ అన్నారు..కామ్‌గా ఉన్నారు

భోగాపురం ఎయిర్‌పోర్టు ఓపెనింగ్‌ సందర్భంగా విద్యార్థులకు పలుపోటీపరీక్షలు

జిల్లా స్థాయిలో ఎంపికలు

ప్రథమ స్థానానికి రూ.1 లక్ష అంటూ

ప్రకటనలు

ముందురోజు రమ్మని ఆదేశాలు

వెళ్లిన తరువాత వెనక్కు పంపించేసిన అధికారులు

తిప్పలు పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు

విజేతలకు ఇంతవరకూ అందని రూ.లక్ష పారితోషకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement