విజయనగరం టౌన్: మండలంలోని బియ్యాలపేట గ్రామంలో నేలబావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాగిత నరసింగరావు(30) మంగళవారం రాత్రి పశువులను మేపుతూ కాలుజారి నూతిలో పడి మృతిచెందాడు. ఆయనకు భార్య లీలావతి ఉంది. మృతుని తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.అశోక్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
చీపురుపల్లి: మండలంలోని కలిసెట్టిబడి గ్రామానికి చెందిన చింత సురపునాయుడు గడ్డి మందు తాగి మృతి చెందాడు. పాల్పడ్డాడు. సూరపునాయుడు కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతోనే గడ్డి మందు తాగి మృతి చెందినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో లాడ్జిలో యువకుడు..
విజయనగరం టౌన్: మండలంలోని గుణుపూరు పేటకు చెందిన యువకుడు విజయనగరంలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బుధవారం జరిగిప ఈ సంఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు, గుణుపూరు పేట గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుణుపూరుపేటకు చెందిన పడాల భరత్ కుమార్ (30) మంగళవారం విజయనగరం పట్టణంలోని బాలాజీ లాడ్జిలో బస చేశాడు. ఉదయం 10.30 గంటల సమయంలో గుండెనొప్పి అని పడిపోవడంతో హోటల్ సిబ్బంది 108కి కాల్ చేశారు. అయితే అప్పటికే మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు. భరత్‌కుమార్‌కు ఇంకా వివాహం కాలేదు. సోదరుడు గణేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై కమల్ భార్గవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి..
గుర్ల: మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన గెద్ద గడ్డి నాయుడు (39) విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. గడ్డి నాయుడు మంగళవారం రాత్రి తన పొలానికి నీరు కట్టడానికి వెళ్లి విద్యుత్ మోటార్ ఆన్‌చేయగా షాక్‌కు గురై మృతి చెందాడు. రాత్రి సమయంలో వెళ్లిన వ్యక్తి అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విద్యుత్ మోటార్ వద్ద చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులు గుర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య పైడిరాజు, కుమారుడు దినేష్ ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.నారాయణ రావు బుధవారం తెలిపారు.
గ్రోత్ సెంటర్‌లో బీహార్ యువకుడు..
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్‌సెంటర్‌లో బీహార్ యువకుడు మృతి చెందాడు. అక్కడి గురుదత్త ఎంటర్ ప్రైజర్స్ అనే పరిశ్రమలో పొడి మిశ్రమాన్ని వేరు చేసే ఇనుప జల్లెడకున్న ఇనుప రాడ్ ఛాతీ, చేతుల మీదుగా గుచ్చుకోవడంతో బీహార్‌లోని రాజ్‌కార్ తాలూకా ప్రొక్రైరా గ్రామానికి చెందిన బికాస్ మాజీ (26) అనే యువకుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో పోలీసులు బుధవారం గ్రోత్‌సెంటర్‌లోని గురుదత్త కంపెనీకి వెళ్లి మృతదేహాన్ని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి సహచర కార్మికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం మధ్యాహ్నానికి బొబ్బిలి చేరుకున్నారు.నాలుగేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న బికాస్‌కు ఏడాది కిందటే వివాహమైనట్లు చెబుతున్నారు. మృతుడికి భార్య అనిషాదేవి, రెండు నెలల కుమార్తె మిస్టీ ఉన్నారు. డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ కె.నారాయణ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.


