శృంగవరపుకోట: దళిత, గిరిజన వాడల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమరమే సమస్యలపై శంఖారావం అని సిటు కార్యదర్శి మద్దిల రమణ చెప్పారు. దళితవాడలు, గిరిజన పల్లెల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించి, పరిష్కారం కోసం పనిచేసేందుకే గత నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కేవీపీఎస్, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో శంఖారావం పేరుతో కార్యక్రమాలు చేశామన్నారు. కులవ్యవస్థ ఏరూపంలో ఉన్నదీ, దళితులు గిరిజనుల నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు పాలక ప్రభుత్వాలు ఎలా కల్పిస్తున్నాయి అనే అంశాలపై సర్వే చేశామన్నారు. దళితులకు శ్మశానవాటికలు లేవు. ఉన్నవాటికి సౌకర్యాలు లేవు. ఉన్నత వర్గాల వారికి శ్మశాన వాటికలవద్ద షెడ్, బోర్లు, కాంపౌండ్ నిర్మించారు. దళితులకు మాత్రం నీరుపారే గెడ్డల్లో సౌకర్యాల్లేకుండా వివక్ష చూపుతున్నారు. దళితులు గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పాలకులు, అధికారులు పట్టాలు మంజూరు చేయకుండా, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసి, చట్టప్రకారం భూమి ఇవ్వాలి. సాగులో ఉన్న వారికి పట్టాలు మంజూరు చేయాలి. మాన్సాస్, పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ కౌలురైతు పట్టా మంజూరు చేయాలి. , దళితులు, గిరిజనులు నివాసముంటున్న ప్రాంతంలో కాలువలు, సీసీ రోడ్లు తాగునీరు సమస్య పరిష్కారం చేయాలి. పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ బోర్డు నుంచి లోన్‌లు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని తహసీల్దార్ డి.శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన గిరిజన సంఘం నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, గిరిజనులు, దళితులు పాల్గొన్నారు.


