● సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య
నెల్లిమర్ల: ఈ ఏడాది విద్యార్థులకు ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ఎక్సెలెనన్స్ సెంటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా నెల్లిమర్లలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అధికారులు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమంపై ఉన్న సామాజిక చిన్నచూపును, వివక్షను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో సంక్షేమం ప్రతి విద్యార్థి హక్కు అని, వసతి, భోజనం, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలో 1350 మంది శానిటరీ వర్కర్లను, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంక్షేమం, శాఖ ఒక కుటుంబమని, కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. గతంతో పోలిస్తే, వసతిగృహాల్లో సౌకర్యాలు, విద్య మెరుగుపడ్డాయని, టెన్త్, ఇంటర్ ఫలితాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.రూపవతి సమావేశానికి అధ్యక్షత వహించగా, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె .ఎస్. శ్రీనివాసచార్యులు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి వీహెచ్ రాధా కుమారి, కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి, ఎస్‌డబ్ల్యూహెచ్‌ఓ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.


