విజయనగరం అర్బన్: స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో చాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్ సెంట్రల్, బీఎన్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింబోసిస్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ ఒ.నరేష్‌కుమార్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు విస్తృతంగా ఏర్పడ్డాయన్నారు. ముఖ్యంగా విజయనగరంలో సరికొత్త పెట్టుబడులు పెట్టే వారికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అన్నారు. సరికొత్త పారిశ్రామిక టెక్నాలజీ ప్రాజెక్టులపై గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ రమాదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


