యువ గుండెకు ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

యువ గుండెకు ఏమైంది?

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

యువత గుండె అకస్మాత్తుగా ఆగిపోతోంది..దృఢంగా ఉన్న వారు సైతం కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో గుండెపోటు బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఇటీవల గుండెపోటు మరణాల్లో యువత సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానం, ఆహారపు అలవాట్లే హార్ట్‌ ఎటాక్‌కు కారణం కాగా జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

విజయనగరం ఫోర్ట్‌: విజయనగరం మండలానికి చెందిన లక్ష్మి అనే 35 ఏళ్ల మహిళ గుండెపోటుకు గురికావడంతో బంధువులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇదిలా ఉంటే ఇదే విజయనగరానికి చెందిన గోపి అనే 34 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు బారినపడ్డాడు. బంధువులు అప్రమత్తమై విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స అనంతరం డిశార్జ్‌ అయ్యారు.

హార్ట్‌ఎటాక్‌ లక్షణాలు ఇవీ..

గుండెపోటుకు గురైన సమయంలో ఛాతిలో నొప్పి విపరీతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా చెమట పడుతుంది. వాంతులు వచ్చే భావన కలుగుతుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లూ చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువు ఛాతిపై పెట్టినట్లు అనిపిస్తున్నా..శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండెపోటు సూచనగానే భావించాలి. ఛాతిలో వచ్చిన నొప్పి.. ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా, విపరీతంగా చెమట వస్తున్నా హార్ట్‌ ఎటాక్‌గానే అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా గుండెజబ్బుగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గుండెపోటుకు గురవుతున్న యువత

పెరుగుతున్న ఆకస్మిక

మరణాలు

జీవనశైలిలో స్వల్ప మార్పులతో హృదయం పదిలం: వైద్య నిపుణులు

అంతా 25 నుంచి 35 ఏళ్లలోపు వారే..

జిల్లాలో తక్కువ వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు గుండెపోటుకు గురియ్యేవారు. ప్రస్తుతం 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అధికంగా గుండె జబ్బుల బారినపడుతున్నారు. గతంలో పౌష్టికాహార విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి హార్ట్‌ ఎటాక్‌(గుండెపోటు)కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement