రేగిడి: మండలంలోని పారంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కడగల కార్తీక్‌కు రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్(స్వర్ణ పతకం) లభించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.సునీత ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి రన్నింగ్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో విద్యార్థి పాల్గొని, విశేష ప్రతిభ కనబరచడంతో స్వర్ణ పతకం వరించిందన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి, ఐదో స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులంతా సదరు విద్యార్థిని అభినందించారు.
అదనపు ఎస్పీ పరిశీలన
సీతానగరం: మండల కేంద్రంలోని మెయిన్‌రోడ్డును ఆనుకుని ఉన్న వక్కలగడ్డ సురేష్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగి బంగారు ఆభరణాలు అపహరణకు గురికాగా ఆ ఇంటిని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని, నిత్యం జనసంచారం ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ హేమలత తదితరులు ఉన్నారు.
‘హోటల్ మేనేజ్‌మెంట్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం క్రైమ్: హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం ఇన్‌చార్జ్ శివరామకృష్ణ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా తిరుపతిలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు. బీఎస్సీ(హెచ్‌హెచ్‌ఏ) మూడేళ్ల కోర్సుకు ఇంటర్మీడియట్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. క్రాఫ్ట్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్‌కు ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు అందుబాటులో ఉందని, ఈ కోర్సులో ప్రవేశానికి ఎటువంటి వయోపరిమితి లేదన్నారు. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక హోటళ్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు బ్యాంకు లోన్ సదుపాయం ఉంటుందని, బాలబాలికలకు వేర్వేరుగా వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలకు అందజేయాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 9701343846, 9100558006, 9700440604లను సంప్రదించాలని కోరారు.
ఆరుతడి పంటల సాగుపై
దృష్టిసారించాలి
● జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్
పార్వతీపురం రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, వరినాట్లకు నీటి కొరత ఏర్పడిందని, రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీ శంకర్ ఓ ప్రకటనలో మంగళవారం సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 28,883 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోందని, ప్రస్తుతం నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ, దమ్ము చేసి వరినాట్లు(ఉభాలు) వేయడానికి తగినంత నీరు లేదన్నారు. ఎల్‌నినో వల్ల ఏర్పడిన ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. మెట్టు, కాలువ చివరి భూముల్లో రాగులు, కొరల్రు, మినుము, పెసర వంటి పంటలు వేసుకోవాలన్నారు.
అనుమానాస్పదంగా
వివాహిత మృతి
విజయనగరం టౌన్: అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన స్థానిక పట్టణంలోని కేఎల్ పురంలో మంగళవారం జరిగింది. ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి..కేఎల్ పురంలో నివాసం ఉంటున్న మేడపల్లి లావణ్య(31) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయిందని, ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. మృతురాలి భర్త వృత్తి రీత్యా దుబాయ్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తల్లి రమణి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఏఎస్‌ఐ రామలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


