ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ వరాలేవీ? | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ వరాలేవీ?

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

విజయనగరం గంటస్తంభం: భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఇటీవల వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర వాసులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడమంటే ఇదేనా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. మంగళవారం విజయనగరానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, కాసేపు మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చివరకు ఈ ప్రాంత ప్రజల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయానికి భోగాపురం పేరు కాకుండా వైజాగ్‌–జీఎంఆర్‌ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభ ఆద్యంతం పరస్పర ప్రొగడ్తలకే పరిమితమైందన్నారు. విజయనగరం జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతీయకుండా విమానాశ్రయానికి భోగాపురం పేరును కొనసాగించాలని కోరారు.

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు..

ఉత్తరాంధ్రలో నాగావళి–వంశధార నదుల వివాదం, కొటియా గ్రామాల సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులు, మూతపడిన పరిశ్రమలు, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ప్రధాని మోదీ స్పందించ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు డోలీల్లో రోగులను తరలించే పరిస్థితులు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మోదీని పొగిడేందుకే కార్యక్రమం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, నాయకులు బుగత అశోక్‌, అలమండ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి ఎలాంటి

హామీలు ఇవ్వలేదు..

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి

హామీలిస్తారోనని వేచి చూసిన

వారికి తీవ్ర నిరాశ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement