గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

సామర్లకోట: గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన చట్టాలపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ కేఎన్‌వీ ప్రసాదరావు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు పెసా చట్టంపై మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రసాదరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంత పరిపాలనలో కీలకమైన పెసా చట్టం, గిరిజన ఉప ప్రణాళిక అమలుకు అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలన్నారు. 10 రాష్ట్రాల్లోని షెడ్యూల్‌ ప్రాంతాలకు పెసా చట్టం వర్తిస్తుందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం అమలుపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గిరిజనుల భూమి, నీరు, అటవీ వనరులు, సంస్కృతి, పాలనా వ్యవస్థలపై వారి హక్కులను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గిరిజన చట్టాలు, ఉప ప్రణాళికపై విస్తృత అవగాహనతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయవచ్చునని ప్రిన్సిపాల్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.రమణ, డీడీఓ శర్మ, పెసా చట్టం రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సంతోష్‌, ఎంపీడీఓ సుశీల, డిప్యూటీ ఎంపీడీఓలు చక్రపాణిరావు, చిన్నబ్బులు, ఫ్యాకల్టీలు శ్రీనివాసు, సుమాంజలి, నరేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement