● వంగర పోలీస్‌స్టేషన్ వద్ద తలగాం వాసి ఆత్మహత్యాయత్నం
వంగర: స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద తలగాం గ్రామానికి చెందిన కిమిడి సునీల్ గొంతు కోసుకొని మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎస్‌ఐ షేక్ శంకర్ తెలిపిన వివరాలిలా.. కొన్నాళ్ల క్రితం సునీల్ ఎం.సీతారాంపురానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకున్నాడు. భర్త సునీల్, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీలత వంగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త సునీల్‌తో పాటు ఆమె అత్తమామలపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇరువర్గాలను మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇస్తుండగా ఈ కేసులో పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ స్టేషన్‌లోనే సునీల్ బ్లేడుతో గొంతు, చేయి భాగం కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు అతడిని రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల తాళ లేకనే సునీల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బంధువుల ఆరోపణ.


