● పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో
189 వినతుల స్వీకరణ
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 189 వినతులు స్వీకరించారు. ఇందులో 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి వినతిని నిర్దేశిత గడువులో పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రాధాన్యంతో విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన తర్వాతే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికల్లో నమోదు చేయాలని సూచించారు.
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
భూ వివాదాలు, సర్వే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున క్షేత్రస్ధాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిరంతరం సమీక్షించాలని సూచించారు.
1100 ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు
రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజల్లో ఈ సేవలపై మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
శాఖల వారీగా వినతులు
పంచాయతీరాజ్–30, డీఆర్‌డీఏ– 18, గ్రామ సచివాలయ శాఖ– 15, విద్య–13, ఇతర శాఖలు–12, విద్యుత్–9, మున్సిపల్–8, వైద్య ఆరోగ్య శాఖ–5, డీసీహెచ్‌ఎస్–1.
చట్టపరిధిలో సత్వరన్యాయం: 21 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్
విజయనగరం టౌన్: చట్టపరిధిలో బాధితులకు సత్వరన్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ అహర్నిశలూ శ్రమిస్తుందని, బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విని వాటికి సంబంధించిన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. తమ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్‌లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యలను పూర్తిగా విని, వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.


