ప్రజా సమస్యల పరిష్కారంలో
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మే రకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక ఉపకలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌డీసీ డి. ధర్మరాజులతో కలిసి మొత్తం 69 వినతులను స్వీకరించారు. వాటిలో 16 రెవెన్యూకు సంబంధించినవి కాగా 53 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయని గుర్తుంచుకుని, సాంకేతిక కారణాలతో కేసులను మూసివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందిన తరువాతే పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో పరిష్కరించినట్లు నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు నాణ్యత, రైతుభరోసా, విద్యుత్ బిల్లు, గోకులం షెడ్ల బకాయిలు, భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా ఫిర్యాదుల పరిష్కారం: ఎస్పీ
పార్వతీపురం రూరల్: ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్) ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దిష్ట గడువులోగా సత్వరమే పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను విచారణ చేసి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 15 వినతులు
సీతంపేట: ప్రతి వారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చే సమస్యలు తక్షణం పరిష్కరించాలని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఇచ్చిన వినతులు ఎంతవరకు పరిష్కారమయ్యాయనేది వారికి ఫోన్ చేసి అడగాలన్నారు. క్యూఆర్ కోడ్ కూడా ప్రారంభించామన్నారు. అనంతరం మొత్తం 15 వినతులు స్వీకరించారు. కుక్ ఉద్యోగం నుంచి అటెండర్ ఉద్యోగానికి ప్రమోట్ చేయాలని ఎస్‌ఎస్ మణుగుకు చెందిన కె.శ్రీరాములు కోరాడు. మర్రిపాడు, పూతికవలస రహదారి మరమ్మతులు చేయాలని, బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని పత్తిక కుమార్ వినతిపత్రం అందజేశాడు. పవర్‌టిల్లర్‌లు ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సాంబయ్య, సుక్కయ్యలు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీపీఎం ఎం.వి.రమణ, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు.


