రాజాం సిటీ: ఏమరపాటుగా ఉన్న ప్రయాణికులను టార్గెట్‌గాచేసుకుని చోరీకి పాల్పడిన నిందితులను రాజాం పోలీసులు పట్టుకున్నారు. ఐదు నెలల క్రితం చీపురుపల్లి నుంచి రాజాం మీదుగా స్వగ్రామానికి ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల దగ్గర బంగారు నగలు చోరీచేసి పరారైన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకుని సంబంధిత బాధితులకు సోమవారం బంగారం అప్పగించారు. ఇందుకు సంబంధించిన టౌన్ సీఐ డి.నవీన్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం సతివాడ గ్రామానికి చెందిన మరిశర్ల భాగ్యలక్ష్మి, భర్త సూర్యనారాయణలు ఈ ఏడాది మార్చి 3న సికింద్రాబాద్ నుంచి రైలులో వస్తూ చీపురుపల్లిలో దిగారు. అక్కడి నుంచి రాజాం మీదుగా స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. రాజాం చేరుకుని ఆటో దిగి వారితో తీసుకువచ్చిన బ్యాగును చూసుకున్నారు. అందులో ఉన్న ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన మెహర్వాన్ ఆలీ, ఇర్షాద్ ఆలీగా గుర్తించారు. రాజాం ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్, విజయనగరం సీసీఎస్ బృందంతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లి నిందితులను అరెస్టుచేసి వారి నుంచి బంగారునగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత బాధితులకు సోమవారం బంగారం నగలను అప్పగించామని సీఐ తెలిపారు.


