చినుకు కినుకు..! | - | Sakshi
Sakshi News home page

చినుకు కినుకు..!

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

నారు మడులు ఎండిపోతున్నాయి..

పెద్దగెడ్డకు గండం

పూర్తిస్థాయికి చేరని నీటిమట్టం

అన్నదాతల్లో ఆందోళన

పాచిపెంట: మండలంలోని పెద్దగెడ్డ జలాశయంపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన మొదలైంది. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ జలాశయం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 213.80 మీటర్లు కాగా ప్రస్తుతం 209.70 మీటర్ల వద్ద మాత్రమే నీరు ఉంది. ప్రస్తుతం పెద్దగెడ్డ ఆయకట్టు రైతుల ఆశలన్నీ వర్షాలపైనే ఉన్నాయి. జలాశయంలో నీటిమట్టం పెరిగితేనే పంటలకు ఊరట లభిస్తుందని, లేకుంటే తీవ్ర నష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు.

40 క్యూసెక్కుల నీటి విడుదల

ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్పిల్‌వే, ప్రధాన కాలువ ద్వారా ఇటీవల రోజుకు 40 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం నుంచి అది కూడా నిలుపుదల చేశారు. ఈ నీరు ప్రస్తుత ఆయకట్టు అవసరాలకు సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల భవిష్యత్తుపై రైతుల్లో ఆందోళన నెలకొంది..

150 క్యూసెక్కులు వదిలితే

40రోజులకే డెడ్‌ స్టోరేజ్‌..

ప్రస్తుత ఆయకట్టుకు సరిపడా నీరు అందించాలంటే రోజుకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని పెద్దగెడ్డ జలాశయ అధికారులు చెబుతున్నారు. అయితే అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తే 40 రోజుల్లోనే జలాశయం పూర్తిగా డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకునే ప్రమాదం ఉందని, వర్షాలు సకాలంలో కురవకపోతే సాగునీటి సమస్య మరింత తీవ్రం కానుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు చెబుతున్నారు.

జలాశయంలో నీరు ఉన్నప్పటికీ అవసరమైనంతగా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు కూడా లేకపోవడంతో పంటలు నిలబడతాయో లేదో భయంగా ఉంది. అధికారులు ముందుగానే చర్యలు తీసుకుని రైతులకు భరోసా కల్పించాలి.

ఈదుబిల్లి సుధీర్‌ నాయుడు,

ఆయకట్టు రైతు, మిర్తివలస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement