బొబ్బిలి రూరల్: మండలంలోని పెంట గ్రామం వద్ద వేగావతి నది నుంచి ఇసుక తవ్వి అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వీఆర్‌ఓ వెంకినాయుడు ఆదివారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిఘా పెట్టామని, అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామని, సెలవు రోజు కావడంతో ఉన్నతాధికారులు అందుబాటులో లేనందున ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచామన్నారు. తదుపరి చర్యలు తహసీల్దార్ తీసుకుంటారని చెప్పారు.
గిన్నిస్ రికార్డ్స్’లో
విజయనగరం వాసి
విజయనగరం టౌన్: అమెరికాలో సిలికానాంధ్ర సహకారంతో 300 మంది మృదంగ కళాకారులతో ఒకే వేదికపై 30 నిమిషాల పాటు రూపొందించిన లయవిన్యాసం కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన విజయనగరానికి చెందిన డాక్టర్ పత్రి సతీష్ కుమార్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ప్రస్తుతం చైన్నెలో ఉంటున్న ఆయన తెలుగువాడిగా, విజయనగరం వ్యక్తిగా రికార్డు అందుకోవడం పట్ల విజయనగర సంగీతాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్ మండపాక రవి, సంగీతాభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు.
2.5 కిలోల గంజాయి పట్టివేత
విజయనగరం టౌన్: ఒడిశా రాష్ట్రంలోని మునిగుడ ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్ర రాజధాని చైన్నెకి అక్రమంగా సరఫరా చేస్తున్న సుమారు రూ.లక్షా 25వేల విలువైన 2.5 కిలోల గంజాయిని రైల్వేపోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జీఆర్‌పీ ఎస్సై వి.బాలాజీరావు మాట్లాడుతూ జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్స్‌పై తనిఖీ నిర్వహిస్తుండగా ఒడిశాలోని కొంధమాల్ జిల్లాకు చెందిన ధర్మేంద్ర పల్లా అనే వ్యక్తి గంజాయిని చైన్నె తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, గంజాయి స్వాధీనం చేసుకుని నిదితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం రైల్వేకోర్టుకు తరలించామని చెప్పారు.
శృంగవరపుకోట: మండలంలోని సన్యాసయ్యపాలెం గ్రామంలో 16 కేవీఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌కు వస్తున్న విద్యుత్ కనెక్ష న్ కట్ చేసి, ట్రాన్స్‌ఫార్మర్ దించేసి డీటీఆర్ వైండింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి దొంగిలించి తీసుకుపోయారు. ఉదయం గ్రామానికి విద్యుత్ సరఫరా లేదన్న కంప్‌లైంట్‌తో లైన్‌కు వచ్చిన సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్ దించేసి విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి వెంటనే ఎస్.కోట ఏఈ జి.రామారావుకు తెలిపారు. ఈ మేరకు ఆయన వెంటనే ఎస్‌కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గాజువాకలో బొబ్బిలి యువతి ఆత్మహత్య
బొబ్బిలి: పట్టణానికి చెందిన ముస్లిం యువతి విశాఖ జిల్లా గాజువాకలో ఆత్మహత్యకు పాల్ప డింది. బొబ్బిలికి చెందిన రషీదా బేగం(26) విశాఖలోని ఓ బ్యూటీ పార్లర్‌లో రెండున్నరేళ్లుగా పనిచేస్తోంది. ఓ పీజీ హాస్టల్‌లో ఉంటూ తాను పనిచేస్తున్న బ్యూటీ పార్లర్‌కు నిత్యం వెళ్లి వస్తుంటుంది. అయితే ఆదివారం ఆమె గాజువాకలోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని అందులోనే ఉరి వేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ లేదని, పోలీసుల నుంచి త్వరగా రమ్మని సమాచారం వచ్చిందన్నారు. వెంటనే తండ్రి నూర్‌ఖాన్, తల్లి మున్నీబేగంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బొబ్బిలి తీసుకువచ్చేందుకు విశాఖ వెళ్లారని మృతురాలి పెదనాన్న కుమారుడు విలేకరులకు తెలిపాడు.


