ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి
స్పందన కరువు
జనసేన, బీజేపీ నుంచి మద్దతు శూన్యం
రోడ్లేవి సారూ...
సాక్షి, పార్వతీపురం మన్యం:
రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం ఆశించిన స్థాయిలో స్పందన కానరావడం లేదు. సొంత క్యాడర్ నుంచే ఊపు అందుకోలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తం 45 రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్లాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27న ప్రారంభించినప్పటికీ.. తొలి రెండు రోజుల్లోనే క్షేత్రస్థాయిలో ఆశించిన ఉత్సాహం కనిపించడం లేదని పార్టీ వర్గాల్లోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చెప్పుకోదగ్గపాలన లేక...
మహిళలకు ఉచిత బస్సు పథకం మినహా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవని.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల్లో భారీగా కోత విధించడం వల్ల నిలదీతలు తప్పవన్న భయం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. అభివృద్ధి పనులు జరగడం లేదు. ప్రధాన పట్టణాలతో పాటు, గ్రామాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎరువులు రైతులకు దొరకడం లేదు. వీటిపై ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపైనా ప్రజల నుంచి ప్రతిఘటన ఉంటుందన్న భయం నాయకుల్లో ఉంది. దీనికితోడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక స్థాయిలో కార్యకర్తలు ఎదురుచూసిన పనులు జరగలేదన్న అసంతృప్తి కొంతమందిలో ఉందని, అదే కార్యక్రమంపై ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలు, నాయకుల్లో ఆశించిన స్థాయిలో పాల్గొనే ఉత్సాహం కనిపించడం లేదని, కార్యక్రమం కేవలం లాంఛనప్రాయంగా కొనసాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలను పక్కనపెట్టి టీడీపీ ఒక్కటే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడంపై ఆ రెండు పార్టీ ల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకొండ వంటి నియోజకవర్గంలో కూడా ఆశించిన స్థాయిలో కార్యక్రమం జరగడం లేదు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు ఉండగా.. వీటి పరిధిలో సుమారు 2,57,047 గృహాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గాల్లోని మూడింటిలో మొక్కుబడిగా కార్యక్రమం సాగుతుండగా.. జనసేన ఎమ్మెల్యే ఉన్న పాలకొండ నియోజకవర్గంలో పేరుకే నిర్వహించి, మమ అనిపిస్తున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వంలో తాము కూడా కీలక భాగస్వాములమేనని, ప్రచార కార్యక్రమాల్లో తమకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిందని బీజేపీ, జనసేన నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. మొదట్లోనే ఇలా ఉంటే.. ముందున్న రోజుల్లో ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లి ఆశించిన ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది.
గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు తాడంగి సాయిబాబు, సహాయ కార్యదర్శి ఊర్లక నాగార్జున డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం లిడికి వలసలో బుధవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వచ్చిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను ప్రశ్నించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... గోచెక్క పంచాయతీ లిడికివలస గ్రామం కొత్త లిడికివలస నుంచి లిడికివలస మీదుగా తాడంగివలస, ఆడారు పంచాయతీ జిల్లేడువలస మీదుగా ఒడిశా సరిహద్దు వరకు గిరిజన గ్రామాలకు అనుసంధానంగా రోడ్లు వేయాలని వినతిపత్రం అందజేశారు.


