● డిప్యూటీ ఎంపీడీఓకు తెలియకుండా లాగిన్‌లో అప్రూవల్
● కంప్యూటర్ ఆపరేటరే వెండర్
సంతకవిటి: మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో జనరల్ ఫండ్ నుంచి బిల్లుల చెల్లింపు పలు అనుమానాలకు తావిస్తోంది. పంచాయతీ కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి పంచాయతీ ప్రత్యేకాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓకు తెలియకుండా లక్షల్లో డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల నుంచి ఈఓపీఆర్‌డీ లాగిన్‌లో బిల్లులు చెల్లింపునకు అవకాశం ఇవ్వగా అదే అదునుగా గ్రామాల్లో లక్షల్లో చెల్లింపులు చేపట్టినట్లు సమాచారం. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓను వివరణ కోరగా దాదాపు రూ.12 లక్షలు బిల్లులు చెల్లింపులు జరగడం వాస్తవమేనన్నా రు. ఈఓపీఆర్‌డీ పాత లాగిన్, పాస్‌వర్డ్ వాడుతుండడంతో ఆయనకు తెలపకుండానే కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కటై బిల్లులు చెల్లింపులు చేశారన్నారు. ఇందులో చాలా పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటరే వెండర్‌గా ఉన్నారని దర్యాప్తు చేయాలని కోరారు.
వనంగుడిలో
పైడితల్లి చండీయాగం
విజయనగరం టౌన్: ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో వేదపండితులు బుధవారం చండీయాగం నిర్వహించారు. సుమారు వందమందికిపైగా భక్తులు యాగంలో పాల్గొన్నారు. యాగ విశిష్టతను వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను యాగంలో పాల్గొన్న భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి ,తరించారు.
వీరబ్రహ్మేంద్ర స్వామికి
విశిష్ట పూజలు
విజయనగరం టౌన్: గురుపౌర్ణమి పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్దనున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి విశ్వబ్రాహ్మణ పురోహితులు లక్కోజు ఓంకార్ సిద్దాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి అభిషేకాలు చేశారు. అనంతరం సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు, ప్రతినిధులు వేముల సురేష్‌బాబు, లక్కోజు బాబు, సంజీవి, శ్రీనివాసరావు భక్తులు పాల్గొన్నారు.


