కేంద్రంలో నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగినప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకున్న విధంగానే, ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పేపర్లు తయారుచేసే ఎస్‌సీఈఆర్‌టీ విభాగంలో 2016 నుంచి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే యువకుడికి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్, టీజీటీలో 6వ ర్యాంక్ రావడం పేపర్ లీకేజీకి ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ముందుగా మొదటి ర్యాంక్ అని మెరిట్ లిస్ట్ ఇచ్చి, ఆరోపణలు రాగానే రెండో ర్యాంక్‌కు మార్చారు. తీరా ఇప్పుడు అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేసింది. తనను కౌన్సెలింగ్‌కు పిలవలేదని ఆ అభ్యర్థి కోర్టుకు వెళ్లడమే పేపర్‌లీకేజీ అయిందనడానికి అతి పెద్ద సాక్ష్యం. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అయితే మరీ దారుణం. ఎటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా నేరుగా పోస్టింగ్ ఇచ్చేలా జీఓ నంబర్–4, 47లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన వారికి కాకుండా.. కేవలం యూనివర్సిటీల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు ఉన్న వారి అనుకూల వ్యక్తులకు ఈ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారు. ఆ పని పూర్తికాగానే గుట్టుచప్పుడు కాకుండా ఆ రెండు జీఓలను రద్దు చేసేశారు. డీఎస్సీపై ఏకంగా 30 వేల ఫిర్యాదులు వచ్చాయని మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ స్వయంగా ఒప్పుకున్నారు కదా!.. కోర్టులో 300కు పైగా పిటిషన్లు పడ్డాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ చేతకానితనమే. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. – పాముల పుష్పశ్రీవాణి,
మాజీ ఉప ముఖ్యమంత్రి
●


