రేగిడి: మండల పరిధిలోని జోడుబందల, సరసనాపల్లి, కందిశ, తునివాడ గ్రామాలకు చెందిన విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు. పాఠశాలలు, కళాశాలలకు చేరుకునేందుకు సకాలంలో బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు పెంచాలంటూ జోడుబందల కూడలిలో రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు గంట సమయం వాహనాలను అడ్డుకోవడంతో సమాచారం అందుకున్న ఎస్సై వి.బాలకృష్ణ ఆందోళన ప్రదేశానికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్యను పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. అవసరమైన బస్సులను తక్షణమే వేళకు నడపాలని విద్యార్థులు కోరారు. బస్సు సర్వీసుల పెంపు విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎస్‌ఐ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


