● రూ.641.10 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం ● ప్రభుత్వం పరిపాలన అనుమతి
సాక్షి, పార్వతీపురం మన్యం: ఎన్నో ఏళ్లుగా వివాదా ల నడుమ ఊగిసలాడుతున్న ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని భామిని మండలం నేరడి(బి)లో వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. వంశధార స్టేజ్–2లో నేరడి బ్యారేజీ నిర్మాణ పనులను రూ.641.10 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణ పనులతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం.. భూసేకరణ వ్యయం కలిపి రూ.641.10 కోట్లలోపే ఉండాలని షరతు విధించింది. వాస్తవానికి వీటికి సుమారు రూ.650 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే భామిని మండలంలోని 18 గ్రామాల్లో ఉన్న దాదాపు 30 వేల ఎకరాల్లో పంట భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు పుష్కలంగా సమృద్ధిగా అందుతుంది. అటు శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి కూడా సాగునీటి వెతలు తీరుతాయి.
దశాబ్దాల కల..
వంశధారలో లభ్యమయ్యే 115 టీఎంసీల నీటిలో 50 శాతం వినియోగించుకునేందుకు 1962 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ – ఒడిశా రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. అప్పటి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం(ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) కాట్రగడ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అంగీకారం తెలిపింది. 1986లో నాటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఒడిశా సీఎం బిజూ పట్నాయక్ మధ్య ముఖాముఖి చర్చలు సైతం జరిగా యి. ఆ తర్వాత 2000లో అధికారంలోకి వచ్చిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నేరడి బ్యారే జీ నిర్మాణానికి రకరకాల అభ్యంతరాలను చెబుతూ వచ్చింది. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమస్యను నివేదించడంతో, 2010లో కేంద్ర ప్రభుత్వం వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాలను పలు సందర్భాల్లో సందర్శించిన ట్రిబ్యునల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యారేజీ నిర్మాణానికి అనుమతినిస్తూ వంశధార నదీ జల వివాదాల ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017లో తీర్పునిచ్చింది. బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాలను సేకరించి ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రిబ్యునల్ తీర్పు అనుకూలంగా వచ్చినా పాలకుల నుంచి ఆ చొరవ లేకపోవడంతో, నేరడి బ్యారేజీ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
దివంగత వైఎస్ ఆశయాలకు అనుగుణంగా...
వెనుకబడిన ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో జలయజ్ఞంలో భాగంగా వంశధార స్టేజ్–2 పనులను చేపట్టారు. నేరడి బ్యారేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరడి బ్యారేజీని నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగి రెండు రాష్ట్రాలతో పలు దఫాలుగా చర్చించింది. ఈ వివాదం పరిష్కారమయ్యేలోగా ఉత్తరాంధ్ర రైతులకు ముందస్తు ఫలాలను అందించేందుకు వంశధారపై కాట్రగడ్డ సైడ్ వియర్, వరద కాలువ, హిరమండలం రిజర్వాయర్ పనులను నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. పనులను శరవేగంతో పూర్తి చేశారు. వైఎస్ ముందు చూపుతో చేపట్టిన ఈ చర్యల వల్ల వంశధార ట్రిబ్యునల్ నేరడి బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2021, నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు వెళ్లి, అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీతో పాటు.. జంఝావతి ప్రాజెక్టు సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.
ఇన్నాళ్లూ చొరవ చూపని ప్రభుత్వం..
ట్రిబ్యునల్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి ఇంజినీరింగ్ అధికారులు సిద్ధమైనా.. ఒడిశా అధికారుల నుంచి స్పందన లేదు. ట్రిబ్యునల్ తీర్చుపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదం ఎటూ తేలలేదు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించగలిగితే నేరడితో పాటు.. కొమరాడలోని జంఝావతి అంతర్‌రాష్ట్ర జల వివాదం కొలిక్కి రావడం పెద్ద సమస్య కాదు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఆ చొరవ చూపలేదు. ప్రస్తుతం అంతా సానుకూలంగా ఉండడం.. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడంతో ఇప్పటికై నా బ్యారేజీ కల నెరవేరుతుందని రెండు జిల్లాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. గెజిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. ప్రాజెక్టుకు అవసరమైన 106 ఎకరాల భూమిని చట్ట ప్రకారం ఒడిశా సేకరించాలి. దీనికి పరిహారం, ఇతర ఖర్చులను ఆంధ్రా నుంచి చెల్లించాలి. బ్యారేజీ వద్ద వంశధార నది లభ్యత 115 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు సగం సగం వినియోగించుకోవాలి. సాంకేతిక ఆమోదంపై ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ శాఖ అధికారుల భేటీ అనంతరం బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి, డిజైన్ చేసి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు పంపిస్తారు. వారి నుంచి సాంకేతిక ఆమోదం వచ్చాక పనులు పట్టాలెక్కనున్నాయి. ఇదే విధంగా జంఝావతి సమస్య కూడా పరిష్కారం కావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


