పార్వతీపురం రూరల్: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పార్వతీపురం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.25 లక్షల విలువైన 2.530 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన ద్వారం సమీపంలో టౌన్ సీఐ బి. వెంకటరావు, ఎస్సై వై. సింహాచలం తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని తనిఖీ చేయగా రెండున్న కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను చైన్నెకి చెందిన అబ్దుల్ ఇర్ఫాన్ (33), కార్తీ (27)లుగా పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని రాయగడ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసి చైన్నెకి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల నుంచి గంజాయితో పాటు రెండు బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆధార్ కార్డు, రూ.800 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


