● జిల్లాకు వస్తున్న ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీలు జయంత్, అభిమన్యు ● కార్యరూపం దాల్చితే మన్యం వాసులకు తీరనున్న గజగండం
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం మన్యం జిల్లాను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న సమస్యల్లో అడవి ఏనుగుల బీభ త్సం ప్రధానమైనది. పంటలు ధ్వంసం కావడం, ఇళ్లపై దాడులు, గిరిజనుల ప్రాణాలు కోల్పోవడం, రాత్రిళ్లు భయంతో గ్రామాలు నిద్రపోకపోవడం... ఇవన్నీ ఈ ప్రాంత ప్రజలకు నిత్యకృత్యంగా మారా యి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాయ ని రెండేళ్లుగా ప్రభుత్వం చెబుతున్న కుంకీ ఏనుగులు.. ఎట్టకేలకు జిల్లాకు వస్తున్నాయి.
జిల్లాలోని కొమరాడ, మక్కువ, సాలూరు, పాచి పెంట, పార్వతీపురం, గరుగుబిల్లి, భామిని మండ లాల పరిధిలో రెండు ఏనుగుల గుంపు సంచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ఒడిశా అడవుల నుంచి ఆహారం, నీటి కోసం గుంపులుగా కొన్నేళ్ల కిందట వచ్చిన ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించి రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. వీటి వల్ల వరి, మొక్కజొన్న, అరటి, చెరకు, జీడి, మామిడి తోటలు భారీగా దెబ్బతింటున్నాయి. వ్యవసాయ మే జీవనాధారంగా ఉన్న గిరిజనులు ఏటా లక్షల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటి వర కూ దాదాపు 700కు పైగా హెక్టార్లలో రూ.2.70 కో ట్ల మేర పంటలకు నష్టం కలిగించాయి. పరిహారం అందినా ఆలస్యం కావడం, పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రాణాలు తీస్తున్న ఏనుగులు
పంట నష్టం మాత్రమే కాదు... మనుషుల ప్రాణాల ను కూడా ఏనుగులు బలితీసుకుంటున్నాయి. ఇప్ప టి వరకూ 13 మంది వరకూ మనుషులు ఏనుగుల దాడిలో మృతి చెందారు. వివిధ ప్రమాదాల్లో ఏనుగులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాయి. పొలాలకు వెళ్లిన రైతులు, అటవీ ప్రాంతాల్లో సంచరించే గిరిజనులు, కట్టెల కోసం వెళ్లిన మహిళలు కూడా ఏనుగుల దాడులకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నా యి. రాత్రి అయితే గ్రామాల ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది.
రెండేళ్లుగా హామీలు...
ఏనుగుల సమస్యను నియంత్రించేందుకు.. మానవ–ఏనుగు ఘర్షణల నివారణకు కుంకీ ఏనుగులను తీసుకొస్తామని ప్రభుత్వం రెండేళ్లుగా ప్రకటిస్తోంది. అధికారుల బృందాలు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం కూడా చేశాయి. పలుమార్లు తేదీలు ప్రకటించినా అమలు కాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను జిల్లాకు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు పూర్తి చేసింది. కుంకీలైన జయంత్, అభిమన్యులను పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి కేంద్రానికి తరలిస్తున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ఈ గజరాజులకు స్వాగతం పలికారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీలు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి. కుంకీలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పెంపుడు ఏనుగు లు. అడవి ఏనుగులను నియంత్రించడం, వాటిని గ్రామాల నుంచి అడవుల్లోకి తరలించడం, ప్రమాదకర పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కర్ణాటక, తమిళనాడు, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో కుంకీలను విజయవంతంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు అదే విధానాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా అమ లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి వద్ద సుమారు 1,100 ఎకరాల్లో రూ.2.50 కోట్ల వ్యయంతో తాత్కాలిక సంరక్షణ కేంద్రం నిర్మించారు. నేడో, రేపో కుంకీలు ఇక్కడికి చేరుకుంటాయి. వీటి వల్లనైనా సమస్య పరిష్కారం అవుతుందా? అన్నది చూడాలి.


