
అర్హులకు కారుణ్య నియామకాలు
● హోంగార్డ్స్ కుటుంబాలతో ఎస్పీ మమేకం
విజయనగరం క్రైమ్: మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. పోలీసు ఉద్యోగుల కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి కారుణ్య నియామకాల కోసం చర్యలు చేపడతామని, ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, సహాయం కావాలన్నా నేరుగా తనను కలవవచ్చని ఎస్పీ అన్నారు. మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ మంగళవారం సమావేశమయ్యారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. మృతి చెందిన ఒక్కొక్క పోలీసు కుటుంబానికి పెండింగ్‌లో ఉన్న సరీ్‌వ్స్ బెనిఫిట్స్, ప్రస్తుతం వాటి స్థితి, ప్రగతి, కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తులకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యాలయ అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగిలిన వారికి అన్ని బెనిఫిట్స్ ఇప్పటికే అందజేశామని తెలిపారు. ఇంకనూ కొన్ని కుటుంబాలకు పెండింగ్‌లో ఏపీజీఎల్‌ఐ, జీఐఎస్, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్, పెన్షన్, భద్రత ఎక్స్‌గ్రేషియా వంటి బెనిఫిట్స్ మరణించిన పోలీసు కుటుంబాలకు త్వరితగతిన మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టేందుకు అర్హతలు కలిగిన వ్యక్తులు వెంటనే సర్టిఫికెట్లు జిల్లాపోలీసు కార్యాలయంలో అందజేస్తే, కారుణ్య నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. కాగా ఇటీవల ట్రాఫిక్ పోలీసు స్టేషనులో విధులు నిర్వహిస్తూ హోంగార్డ్ పి.శ్రీనివాసరావు మరణించగా, వెల్ఫేర్ గ్రాంట్ కింద మంజూరైన రూ.15 వేల చెక్కును ఆయన సతీమణి పి.లక్ష్మీ ప్రసన్నకు ఎస్పీ వకుల్ జిందల్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ పరిపాలనాధికారి పి.శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఆఫీసు సూపరింటెండెంట్లు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఆర్‌ఎస్సై ప్రసాదరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస రావు, జిల్లా పోలీసు కార్యాలయం ఉద్యోగులు, పోలీసు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.